గోవాలో అమెరికన్ దొంగల అరెస్టు

నిందితుల నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారు నగలు, రూ. 12,500 భారత కరెన్సీ, 11 వేల ఇండోనేషియా కరెన్సీ, 26 టెంకా మలేషియా కరెన్సీ, రెండు సింగపూర్ డాలర్లు, వీసాలు, మూడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నలుగురిలో ఒక మహిళ కూడా వుంది. ఈ కేసుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ శంకర బిదరి విలేకరుల సమావేశంలో వివరించారు.
నిందితులు లాటిన్ అమెరికా కొలంబియా ప్రాంతానికి చెందినవారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు బెంగళూరులోని కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆభరణాల ప్రదర్శనకు వచ్చారు. వ్యాపారులను, వారు తీసుకువచ్చిన నగలను క్షుణ్ణంగా పరిశీలించారు. జైపూర్ నివాసి శైని తయారు చేసిన ఇటాలియన్ ఆభరణాలపై వీరి కన్ను పడింది. శైని బస చేసిన ఫ్రైడ్ హోటల్‌ను గుర్తించారు. ప్రదర్శన చివరి రోజు 22వ తేదీ రాత్రి శైని కంపెనీ ఉద్యోగులు నగలు తీసుకుని ఆ హోటల్ కెళ్లారు. వారిని ఈ నలుగురు వెంబడించారు. నగలు రూం నెంబర్ 216లో పెట్టి వారు భోజనానికెళ్లారు. అదే సమయంలో నలుగురు గది తలుపులు చాకచక్యంగా తీసి నగలు దోచుకుని పరారైనారు.
బాధితులు అశోక్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు సీసీబీ పోలీసులకు అప్పగించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు దేశంలోని అన్ని నగరాల పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలోని దృశ్యాలను చూసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నగలు దోచుకున్న నిందితులు అదే రోజు రాత్రి ట్యాక్సీలో గోవా పరారైనారని పోలీసులు ఆధారాలు సేకరించారు. గోవా వెళ్లిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. అప్పటికే నిందితులు చోరీ చేసిన నగలు ఒక బ్యాగులో పెట్టి, వాటిపైన కార్బన్ పేపర్లు పెట్టి కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి బ్లూడార్ట్ కొరియర్ ద్వారా విదేశాలకు తరలించాలని సిద్ధమయ్యారు. చివరికి గోవాలో నిందితులను సీసీబీ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారని శంకర బిదరి తెలిపారు.












Click it and Unblock the Notifications