హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించాల్సి ఉంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి వైయస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని మంత్రి పితాని సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి వైయస్ జగన్ ఈ ఓదార్పు యాత్రను తలపెట్టారు.
హైదరాబాద్ పాత బస్తీలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో జగన్ ఓదార్పు యాత్ర వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 8,9 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ నెల 11, 12 తేదీల్లో ఖమ్మం జిల్లాలో జగన్ పర్యటిస్తారని చెబుతున్నారు.