హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరెంట్ చార్జీల మోతకు ప్రభుత్వం రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంపునకు ప్రతిపాదనలు చేసింది. ఈ రంగాలకు యూనిట్‌కు 50 పైసల చొప్పున ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. ఇదిగాక పరిశ్రమలకు నిర్దేశిత సమయాల్లో వాడుకున్న కరెంట్‌కు అదనపు వడ్డింపునకు సిద్ధమైంది. ఎత్తిపోతల పథకాల్నీ వదల్లేదు. రైల్వేకు యూనిట్‌కు 80 పైసలు పెంచాలని ప్రతిపాదించింది. గృహ, వ్యవసాయ రంగాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఛార్జీల పెంపు ద్వారా పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే తదితర వినియోగదారుల నుంచి ఏటా రూ.2278 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. ఇందులో అధిక వినియోగ వేళల్లో అదనపు ఛార్జీల ద్వారా 350కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి పెంపు ప్రతిపాదనలు సమర్పించాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి. 2002లో చివరిసారిగా ఛార్జీల్ని పెంచారు.

నాలుగు డిస్కంల రెవెన్యూలోటు రూ.10,120 కోట్లకు చేరుకుంది. ఇందులో ఛార్జీల పెంపు ద్వారా రూ.2278 కోట్లు ఆదాయం వస్తుందని అంచనావేశాయి. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వినియోగం ఏటా 20 వేల మిలియన్‌ యూనిట్లపైన ఉంటుంది. యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచితే ఈ రంగాల నుంచి 2 వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం సమకూరుతుంది. తొలిసారిగా కరెంటు అధికంగా వినియోగించే వేళల్లో యూనిట్‌కి అదనంగా వసూలుచేయడానికి ప్రభుత్వం మొగ్గుచూపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు యూనిట్‌కి 75 పైసలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు యూనిట్‌కు రూ.1 అదనంగా వసూలుచేయడానికి ప్రతిపాదించాయి. నిర్దేశిత సమయాల్లో విద్యుత్‌ వాడకం నుంచి 350 నుంచి 400 కోట్ల రూపాయల మేర రాబట్టవచ్చని భావిస్తున్నారు.

వినియోగ వేళల వారీగా మీటరు రీడింగ్‌ నమోదుచేయడానికి ప్రత్యేక మీటర్లు(ఏబీటీ-ఎవైలబిలిటీ బేస్డ్‌ టారిఫ్‌) బిగిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు మాత్రం యూనిట్‌కి 50 పైసలు చొప్పున పెంచనుంది. ఫెర్రో అల్లాయ్స్‌ విద్యుత్‌ ఛార్జీని రూ.2.40 నుంచి రూ.2.90 చేయాలని ప్రతిపాదించారు. వాణిజ్య రంగానికి భారీగా ఛార్జీలు పెంచడానికి ప్రతిపాదించిన ప్రభుత్వంఇప్పటి వరకూ ఉన్న రెండు స్లాబ్‌లను మూడుస్లాబ్‌లుగా మార్చింది. నెలకు 100 యూనిట్లులోపు కరెంటు వాడుకునే వాణిజ్య వినియోగదారులకు మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుత విధానంలో 50 యూనిట్లు మించి వాడుకునే వినియోగదారులంతా ఒకే స్లాబ్‌లో ఉన్నారు. ప్రతిపాదించిన విధానంలో 51 నుంచి 100 యూనిట్లు ఒక స్లాబ్‌గా, 100కి మించి వాడుకునే వినియోగదారులు మూడోస్లాబ్‌గా పేర్కొన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎత్తిపోతల పథకాలపై వడ్డించడానికి సిద్ధమైంది. ఒకేసారి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచబోతున్నారు. ప్రస్తుతం యూనిట్‌ ధర రూ.2.36 పైసలు కాగా పెంపుదలతో రూ.2.86 పైసలు అవుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X