యోగీ మోడల్ నిర్ణయాలతో సువేందు, రంగంలోకి బుల్‌డోజర్లు..!!
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం తో మార్పు ఖాయమని ఎన్నికల వేళ ప్రచారం చేసారు. ఇప్పుడు యూపీలో బీజేపీ సీఎం యోగీ అమలు చేస్తున్న ఫార్ములా నే బెంగాల్ లోనూ సువేందు అమలు కొనసాగిస్తున్నారు. తాజాగా బుల్‌డోజర్లు రంగంలోకి దిగటంతో .. ఇక, యోగీ మార్క్ పాలన ఇక్కడా మొదలైందనే చర్చ వినిపిస్తోంది.
పశ్చిమ బెంగాలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం మార్పు చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా యూపీ సీఎం యోగి మోడల్‌ను అమలు చేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు బుల్డోజర్లను రంగం లోకి దింపింది. సిలిగురిలోని అక్రమ నిర్మాణాల్ని బుల్డోజర్లతో కూల్చేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా కూడా ఈ చర్యను సమర్ధించారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం రెండు డజన్ల బుల్డోజర్లను యూపీ ప్రభుత్వం నుంచి బెంగాల్ ప్రభుత్వం తెప్పిస్తోందని ఆయన వెల్లడించారు. అక్రమ నిర్మాణాల అంశంపై సిలిగురిలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్య అధికారుల సమక్షంలో తీసుకోవాల్సిన చర్యల పైన సమీక్షించారు. కీలక నిర్ణయాలు చేసారు.

యోగీ మోడల్ అమలుకు నిర్ణయం
ఈ ప్రాంతంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడం, అక్రమ నిర్మాణాల్ని తొలగించడం, డ్రగ్స్‌ను అరికట్టడం, అక్రమ మద్యం, బార్ షాపులను తొలగించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజు బిస్తా మాట్లాడుతూ, సిలిగురిలో అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిశాయని, వాటిని వదిలేది లేదని తేల్చి చెప్పారు. వీటిని కూల్చేందుకు యూపీ నుంచి బోల్డోజర్లు తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. అక్రమ నిర్మాణాల విషయంలో సిలిగురి మున్సిపాలిటీ పాలకులు, అధికారులు విఫలమయ్యారని ఎంపీ విమర్శించారు. ఈ విషయంలో వారి నుంచి త్వరలోనే వివరణ కోరనున్నట్లు తెలిపారు. సిలిగురిలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఇతర జలవనరులు వంటి చోట కబ్జాల్ని పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేసారు. దీంతో.. యోగీ ఫార్ములా లే ఇక పశ్చిమ బెంగాల్ లోనూ అమలు చేస్తారనే చర్చ మొదలైంది.













Click it and Unblock the Notifications