వైయస్ జగన్ పార్టీ పెట్టినా దానికి చాన్స్ లేదు: రాయపాటి

జగన్ కొత్త పార్టీ పెడుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై స్పందిస్తూ 'రాష్ట్రంలో కొత్త పార్టీకి స్థానం లేదు. ఎందుకంటే..ఎన్టీరామారావు పార్టీ పెట్టిన సమయంలో 90 శాతందాకా రాజకీయ అవకాశాలు కాంగ్రెసు చేతిలోనే ఉండేవి, మిగిలిన కొంత ఖాళీని వామపక్షాలు భర్తీచేసేవి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. వాళ్లకూ 90కి పైగా అసెంబ్లీ స్థానాలొచ్చాయి. రాజకీయ అవకాశాల్లో ఖాళీ లేదని స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల జగన్ ఎలా ఎదుగుతారన్నది ప్రస్తుతానికేమీ చెప్పలేం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సానుభూతి మీద కొన్ని సీట్లు రావొచ్చు.
భవిష్యత్తులో అదెలా ఉంటుందనేది ఎవ్వరూ చెప్పలేం' అని పేర్కొన్నారు. పార్టీని వదిలి బయటికెళ్లి వచ్చిన వారికే కాంగ్రెసు నాయకత్వం పెద్దపీట వేస్తోందని వ్యక్తమవుతున్న అభిప్రాయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ''బయటి నుంచి కాంగ్రెసులో వచ్చిన వ్యక్తులకు వారి శక్తిసామర్థ్యాలను బట్టి మంచి పదవులే వచ్చాయి. ఈ విషయంలో పార్టీలోని సీనియర్లకు కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే. అయిదారుసార్లు గెలిచిన సీనియర్లను నిర్లక్ష్యం చేసి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వడంపట్ల మాలాంటి వారంతా అసంతృప్తితో ఉన్నారు" అని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఒకసారి పార్టీ వీడి తిరిగి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటారా? అని అడిగినప్పుడు "అలా వచ్చిన వారిలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాసుబ్రహ్మానందరెడ్డి బయటికెళ్లి వచ్చారు.
వెంగళరావు కూడా అంతే. ఒక్కోసారి అదృష్టం కలిసివస్తే ముఖ్యమంత్రి అవుతారు. మంత్రి పదవీ తీసుకుంటారు. అదృష్టం లేనివాళ్లు మాలాగా ఉంటారు" అని వ్యాఖ్యానించారు. తనలాంటి సీనియర్లకు పదవులు రాకపోవడంపై చింతిస్తున్నట్లు చెప్పారు. తాము సంతోషంగా లేమనీ, తగిన గుర్తింపు కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications