హైదరాబాద్: బృందావనం షూటింగ్ ప్రమాదం నేపథ్యంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కొత్త కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. హైదరాబాదు శివారులోని కోకాపేట వద్ద షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కు తమ అనుమతి లేదని, అందువల్ల న్యూసెన్స్ కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు.
కాగా, ఎన్టీఆర్ కు సికింద్రాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి డిశ్చార్జీ చేశారు. ఎన్టీఆర్ గాయానికి ఆరు కుట్లు పడ్డాయి. డిశ్చార్జీ అనంతరం ఆయన నేరుగా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆందోళన చెందవద్దని ఆయన అభిమానులను కోరారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు జూనియర్ ఎన్టీఆర్ కు సూచించినట్లు సమాచారం.