జగన్ పై పార్టీ లోపలి నుంచి, బయట నుంచి పెరుగుతున్నఒత్తిడి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీలపై సమరం సాగిస్తోంది. కాంగ్రెసు శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఆ విషయాన్ని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అందిపుచ్చుకున్నారు. శుక్రవారం కెసిఆర్ తో ఎమ్మార్ బాధితులు భేటీ అయ్యారు. వారికి కెసిఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మార్ వ్యవహారాన్ని అతి పెద్ద కుంభకోణంగా బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు లేకండా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల డిమాండ్లు, ఆందోళనలు అలా ఉంటే అధికార పక్షం నాయకులు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మార్ బాధితులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు తీసుకుని వెళ్తానని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు చెప్పారు. వైయస్ జగన్ చిన్నపిల్లాడేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం లాంటిది జరిగితే విదేశాల్లోనైతే ఉరి తీసేవారని కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై ఎపిఐఐసి నివేదిక కోరామని మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ నుంచి వేయి కోట్ల రూపాయలు రావాలని ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం చెప్పారు.












Click it and Unblock the Notifications