చంద్రబాబుపై కస్సుమన్న తెరాస నేత కె చంద్రశేఖర రావు

"నేను తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీలో చంద్రబాబుకన్నా సీనియర్ ను. కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని ఆయన అప్పట్లో బీరాలు పలికారు. మేమంతా పార్టీని నిర్మించి, అధికారంలోకి వచ్చాక అప్పుడు ఊగుకుంటా వచ్చారు. మంత్రి పదవులు సీనియర్ మెంబర్లకు, కష్టపడిన వాళ్లకు వస్తాయి. నాకు పదవి ఊరికే వచ్చింది కాదు. ఏం..చంద్రబాబూ నాకు పదవి భిక్షంగా వేశావా? అప్పనంగా ఇచ్చావా?'' అని నిలదీశారు. కెసిఆర్ ను తిడితేనో, విజయశాంతిని జైలుకు పంపితేనో, నాయనిపై దుమ్మెత్తిపోస్తేనో తెరాస ఏదో అయిపోతుందనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. తెలుగుదేశం ద్వంద్వ విధానాలు నచ్చకపోవడం వల్లే, ఆ పార్టీ నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తమ పార్టీలో చేరుతున్నారని కేసీఆర్ చెప్పారు.
సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరపాలనే తమ డిమాండ్‌పై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. "ఒక్కసారే స్వాతంత్య్ర దినోత్సవం చేస్తారంటూ ఆయన నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారు. ఆయనకెంత పొగరు? ఆయన సొంత జిల్లా అనంతపురం పక్కనే ఉన్న బళ్లారిలో స్వాతంత్య్ర దినం జరపటంలేదా? తెలంగాణ విషయంలో జేసీకి ఎందుకింత అహంకారం" అని ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌లకు దమ్ముంటే ముఖ్యమంత్రి రోశయ్య మెడలు వంచి సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ స్వాతంత్య్ర దినంగా జరిపించాలని సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications