హైదరాబాద్: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో మునిగిపోయిన అధికారులకు ఢిల్లీలోని వరుస కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకవిధంగా ఢిల్లీ కన్నా హైదరాబాద్ తీవ్రవాదులకు నిలయం. కాబట్టి ఈ సమయంలో ఇక్కడి పోలీసు అధికారులు ఒక్కసారిగా మరింత అప్రమత్తమయ్యారు. గతంలో ఇక్కడ జంట పేలుళ్లు జరిగినప్పటినుంచి హైదరాబాద్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగా ఇంతకుముందు జంట పేలుళ్లకు పాల్పడిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీనే తాజాగా ఢిల్లీ కాల్పులకు బాధ్యులం తామేనని ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రోజున గణేష్ నిమజ్జనం కోసం పోలీసు అధికారులు భారీ ఏర్పట్లు చేస్తుండగా ఈ కాల్పులు జరగటం, దానికి తామే బాధ్యులమంటూ ఇండియన్ మూజాహిదీన్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 24ల 'అయోధ్య'పై అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కూడా ఈ కాల్పులు జరపటం వెనుక భయాందోళన సృష్టించాలనే ఉద్దేశ్యం ఉన్నట్టు కనిపిస్తుంది. కాగా అలహాబాద్ తో పాటు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి తదితర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను ఇప్పటినుంచే మోహరించారు. వీటిని 24 వరకూ కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ విషయమై తాము ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పూనుకోమని అటు ఆర్ ఎస్ ఎస్, ఇటు ముస్లిం సంఘాలు ప్రభుత్వానికి తెలిపాయి. తమకు తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టుకు వెళతాం కాని ఎలాంటి విద్రోహ చర్యలకు పూనుకోమన్నారు.