తెలంగాణ వస్తే నక్సల్స్ ఎజెండా అమలు చేస్తాం: కె చంద్రశేఖర రావు

ఇటీవల ఆల్ ఇండియా సీఈవోల ఫోరం వారు తనను సమావేశానికి ఆహ్వానించారని, తెలంగాణ నాయకుడిని ఆహ్వానించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. డిసెంబరులో అమరణ నిరాహార దీక్ష, కేంద్ర ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో జరిగిన బందులు, ఇతర ఆందోళనల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద పెద్ద కంపెనీల ముఖ్య అధికారులు తన వద్దకు వచ్చి ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సీఈవోల ఫోరం వారు వచ్చి తాము హైదరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని, రావాలని కోరారని వెల్లడించారు. వారి కోరిక మేరకే తాను సీఈవోల ఫోరం సమావేశానికి వెళ్లానని స్పష్టం చేశారు. సమాశాన్ని తాము నిర్వహించలేదని చెప్పారు. కానీ రాష్ట్రంలోని ఒకట్రెండు పత్రికలు ఇష్టమొచ్చినట్లు కథనాలు రాశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి నేత దేవేందర్ గౌడ్ ఓ బ్రోకెన్ లీడరని, ఆయన ఇప్పుడు తుపాకీ రాముడిలా మాట్లాడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. టిడిపి విధానాలపై బహిరంగంగా విమర్శలు చేసి బయటకు వచ్చి సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి 3 నెలలైనా నడపలేక ఆంధ్ర పార్టీలో కలిపారని, రెండు స్థానాల్లో పోటీచేసి కనీసం ఒక్క దాంట్లోనూ గెలవలేకపోయాడని విమర్శించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పంచనచేరి ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంత కవుల రచనలకు తగిన గుర్తింపు రాకపోవడానికి సమైక్య రాష్ట్రమే కారణమని, సీమాంధ్ర పాలకులు ఇక్కడి వారిని తగిన విధంగా ప్రోత్సహించలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు ఎస్వీ రామారావు 'పాలమూరు సాహితీ వైభవం' పేరుతో రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications