ఇద్దరు చంద్రుల పోరు: చంద్రబాబుపై కె చంద్రశేఖర రావు పైచేయి?

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై పోరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పైచేయి సాధించినట్లే కనిపిస్తున్నారు. తమ పార్టీని టార్గెట్ చేసుకున్న కెసిఆర్ పై ఎదురుదాడికి, ఆ తర్వాత దాడికి చంద్రబాబు ఎంచుకున్న మార్గాలన్నీ ఎదురు కొడుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా, తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేయాలనే తెలుగుదేశం తెలంగాణ నాయకులు తీసుకున్న నిర్ణయం కూడా ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. సోనియా ఇంటి ముందు ధర్నాకు రావాల్సిన ఒత్తిడిలో కెసిఆర్ పడతారని భావించిన చంద్రబాబును అది తీవ్రంగా దెబ్బ తీసింది. తెలుగుదేశం తెలంగాణ నాయకుల కార్యక్రమానికి విరుగుడును కెసిఆర్ వెంటనే కనిపెట్టారు. సోనియా గాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేశారని, దాన్ని అడ్డుకున్నది చంద్రబాబేనని ఆయన తెంపు లేకుండా ప్రచారం సాగిస్తున్నారు.

సోనియాకు కెసిఆర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెసుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని తెలుగుదేశం తెలంగాణ నాయకులు చేసిన ఎదురు దాడి ఏ మాత్రం ఫలితం ఇవ్వడం లేదు. నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన తర్వాత ప్రధానంగా ఎదురు తిరిగింది చంద్రబాబే. నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయినా అంతకు ముందు తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు కట్టుబడి ఉంటే ఆయనపై విశ్వసనీయత పెరిగి ఉండేది. కానీ, చంద్రబాబు ఆ విషయం స్పష్టం చేయకుండా ఇరు ప్రాంతాల నాయకులను రెచ్చగొట్టి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. అంతేకాకుండా, తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లంటూ కొత్త రాగం ఆలపించారు. దానికితోడు, ఆయన బావ మరిది నందమూరి హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇదంతా తెలంగాణపై చంద్రబాబు చెప్పే మాటలను నమ్మే పరిస్థితి లేకుండా చేసింది.

సోనియా ఇంటి ముందు ధర్నాకు రావాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు ఇచ్చిన పిలుపు కూడా కెసిఆర్ ఎత్తుగడలతో ఎదురు తిరిగింది. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబుతో శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇప్పిస్తే తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని, సోనియా ఇంటి ముందు మొదటి తుపాకీ గుండును తానే తింటానని ఆయన గురువారం షాద్ నగర్ సభలో చెప్పారు. ఆ విషయం వచ్చేసరికి పార్లమెంటులో బిల్లు పెడితే తాము సమర్థిస్తామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు గురువారం అన్నారు. కానీ, అది సాధ్యమయ్యేది కాదని, బిల్లు పెడితే మరో విధమైన మెలిక పెట్టే అవకాశాలు లేకపోలేదని అనుకుంటున్నారు.

సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కెసిఆర్ అంటున్న మాటలకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దీటైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సోనియా కెసిఆర్ చెవిలో చెప్పారా అని వేస్తున్న ప్రశ్న అర్థరహితంగా మారిపోతోంది. కాంగ్రెసు పార్టీ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అధికారికంగా హోం మంత్రి చిదంబరంతో చెప్పించిన తర్వాత అది పార్టీ నిర్ణయమే అవుతుంది. ఆ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న సోనియా అనుమతి లేకుండా చిదంబరం అధికారిక ప్రకటన చేస్తారని చెప్పడం ఏ మాత్రం సమంజసంగా కనిపించదు. కాంగ్రెసు నాయకులు ప్రాంతాలవారీగా విడిపోతే దాన్ని సర్గుకునే భారం సోనియా గాంధీ మీదనే ఉండేది. కానీ, చంద్రబాబు తెలంగాణపై తన మాట నిలబడక పోవడంతో తమ సీమాంధ్ర నాయకులకు నచ్చజెప్పాల్సిన అవసరం సోనియా గాంధీకి లేకుండా పోయింది. ఇదంతా చంద్రబాబు వల్లనే జరిగిందని ప్రజలకు తెలియజేయడంలో కెసిఆర్ చాలా వరకు సఫలీకృతమయ్యారనే చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+