కెసిఆర్ కారుకు బ్రేకులు: చుట్టుముడుతున్న వ్యతిరేక శక్తులు

తమ ఆత్మాభిమానాన్ని కెసిఆర్ దెబ్బ తీశారని తెలుగుదేశం నాయకులతో పాటు గద్దర్ కూడా అంటున్నారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారు కాబట్టే కెసిఆర్ పై తీవ్రంగా తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తనను ఫుట్ పాతోడని అన్నారని గద్దర్ చెప్పకనే తన ఆత్మాభిమానం దెబ్బ తిన్నదని కెసిఆర్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి కెసిఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. తెరాసను వసూళ్ల పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ సాధన ప్రతిష్ట అంతా కెసిఆర్ కు దక్కకుండా చేయాలని కాంగ్రెసు నాయకులు ప్రయత్నిస్తుండగా కెసిఆర్ ను దెబ్బ తీయడమే లక్ష్యంగా తెలుగుదేశం, ప్రజా ఫ్రంట్ ప్రయత్నిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ప్రజా ఫ్రంట్ ను తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఆహ్వానించాయి. కానీ కెసిఆర్ మాత్రం దానిపై మాట్లాడడానికి నిరాకరించారు. గద్దర్ వ్యవహార శైలి పట్ల కెసిఆర్ కు మొదటి నుంచీ కోపంగానే ఉంది.
కాగా, ఇప్పుడు తెరాస బలమంతా కోదండరామ్ నాయత్వంలోని పొలిటికల్ జెఎసిలో ఉందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజా సంఘాలను కూడగట్టడంలో కోదండరామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అదంతా తెరాసకు ఉపయోగపడుతూ వస్తోంది. గద్దర్ రాజకీయ రంగ ప్రవేశంతో ఆ మద్దతు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. అలా చీలిపోవడం వల్ల తెరాసకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందనేది ఓ అంచనా. బతుకమ్మ పండుగ నిర్వహణ వంటి వాటి ద్వారా కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సాంస్కృతిక రంగాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతికి లభిస్తున్న మద్దతును కూడా చీల్చే ప్రయత్నం ప్రజా సంఘాల నుంచి ఉంటుంది. ఏమైనా, కెసిఆర్ మరోసారి ఆత్మరక్షణలో పడతారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications