పార్టీ నాయకత్వంపై తిరుగుబాటుకు వైయస్ జగన్ క్యాంప్ రెడీ

షోకాజ్ నోటీసు అందుకున్న నెల్లూరు డిసిసి అధ్యక్షుడు వై. గోపాల్ రెడ్డి కూడా వెనక్కి తగ్గలేదు. షోకాజ్ నోటీసులు అందుకున్న తిరుపతి నగర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రతాప రెడ్డి కూడా జగన్ వెంటనే ఉండడానికి నిర్ణయించుకున్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ వరుసగా పార్టీ నాయకత్వం తీరుపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా, అంబటి రాంబాబు పిసిసి నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విషసర్పంలాగా పిసిసి నాయకత్వం వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పాము కళ్లు మూసుకుపోయి తన పిల్లలనే తిన్నట్లు పిసిసి నాయకత్వం వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నవారిపై చర్యలు తీసుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.
షోకాజ్ నోటీసు అందుకున్న ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. పిసిసి చర్యలపై ఆయన విమర్శలు చేశారు. ఈ నాయకుల తీరు చూస్తుంటే పార్టీ నాయకత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకే వారు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. తెగ దాకా లాగడం కూడా వారి మనోగతంగా తెలుస్తోంది. వరుసగా పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయాలని, వైయస్ జగన్ ను కావాలని అణచివేస్తున్నారనే అభిప్రాయం కలిగేలా చూడాలని ఆయన వర్గీయులు భావిస్తున్నట్లు సమాచారం. పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెసులో కుంపటి రాజుకునే వాతావరణం దగ్గరలోనే ఉందనిపిస్తోంది.












Click it and Unblock the Notifications