చెన్నై: అన్నాడియంకె చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తలకు రూ.55 కోట్ల వెల కట్టినట్లు తాజాగా బెదిరింపు లేఖ అందింది. జయలలితకు కొద్దిరోజులుగా ఇలాంటి బెదిరింపు లేఖలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం జయ టీవీ ఛానెల్ కార్యాలయానికి మరో నాలుగు బెదిరింపు లేఖలు అందాయి. విరుదునగర్ ఆవడిపట్టిలోని ఎన్వీ పేరవై పేరిట వచ్చిన ఓ లేఖ జయలలిత తలకు రూ.55 కోట్లు వెల కట్టినట్లు పేర్కొంది. మదురైలో ఈ నెల 18వ తేదీన జరగనున్న ఆందోళనలో పాల్గొనేందుకు జయలలిత వస్తే ఆమెని హతమార్చేందుకు ఆత్మాహుతి దళాలు సిద్ధంగా ఉన్నాయని మదురై నుంచి జాకబ్ పేరిట ఓ లేఖ, మదురైకు వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరని మదురై రంగరాజన్ నగర్ శీలనాయకన్ వీధి చిరునామాతో మరో లేఖ, మదురైకు రావడం ఆత్మహత్యతో సమానమని కృష్ణగిరి జిల్లా పనితోట్టం చిరునామాతో వేరొక లేఖలో హెచ్చరించారు.
జయలలితకు వచ్చిన బెదిరింపు లేఖలపై జయ టీవీ వైస్ ప్రెసిడెంట్ (న్యూస్) కెపి సునీల్ డిజిపికి, చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వాటి ప్రతులను మీడియాకు విడుదల చేశారు. బెదిరింపు లేఖలకు వివిధ చిరునామాల నుంచి వచ్చినట్లు వాటిని బట్టి తెలుస్తోంది. బెదిరింపు లేఖలపై వెంటనే దర్యాప్తు చేపట్టి, ఆ లేఖల వెనక ఉన్నవారిని వెంటనే అరెస్టు చేయాలని సునీల్ డిమాండ్ చేశారు.