ముగిసిన ఎండల తీవ్రత, రేపే రుతువపనాలు- ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవనాల కదలికల ప్రభావంతో తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
రుతుపవనాలు రేపు (గురువారం) కేరళలో ప్రవేశిస్తున్నాయి. మరో వారంలో రాయలసీమ తో పాటుగా తెలంగాణకు విస్తరించే అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ సహా మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించారు. ఈ భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు
మరోవైపు దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాలు పడనున్నందున, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటు ఏపీలోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో కోస్తాతో పాటుగా సీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రుతుపవనాలు అంచనా మేరకు ముందుకు కదిలితే.. వచ్చే వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications