తృణమూల్ లో అన్ని కమిటీలు రద్దు చేసి పడేసిన మమత బెనర్జీ- భారీ ప్రక్షాళన
తృణమూల్ కాంగ్రెస్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి చెందిన అన్ని కమిటీలను రద్దు చేసింది. వీటితో పాటు అనుబంధ సంస్థల కమిటీలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పార్టీలో తీవ్ర అంతర్గత గందరగోళానికి దారి తీసింది. పార్టీలో తీవ్రస్థాయిలో విభేదాలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్‌లోని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ కమిటీలన్నింటినీ, అలాగే దాని అన్ని అనుబంధ సంస్థల కమిటీలను కూడా తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వెల్లడించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. టీఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం.. 58 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకం కావడం, నూతన ఎమ్మెల్యే రిత్‌బ్రతా బెనర్జీని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంచుకున్న గంట లోపే వెలువడింది.

అంతకుముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రిత్ బ్రత బెనర్జీతో పాటు మరో ఎమ్మెల్యే సందీపన్ సాహాను బహిష్కరించింది తృణమూల్. బహిష్కరణకు ముందు రిత్‌బ్రతా బెనర్జీ.. తృణమూల్ కార్మిక సంఘం విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. బెంగాల్‌ను 15 సంవత్సరాలు పాలించిన తృణమూల్ కాంగ్రెస్.. మొన్నటి ఎన్నికల్లో 80 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పయిన నెల రోజుల్లోనే వేగంగా విభేదాలను చవి చూస్తోంది.
పార్టీ నాయకులు కీలక అంతర్గత సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే జిల్లాల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలోని పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సామూహికంగా రాజీనామా చేయడమో లేక పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల్లో అరెస్టు కావడమో జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఆత్మపరిశీలన చేసుకొని, సంస్థను కొత్తగా నిర్మిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది.
పార్టీ ప్రతి స్థాయిలో సమగ్ర ఆత్మపరిశీలన, పనితీరు సమీక్ష, సంస్థాగత అంచనా ప్రక్రియను చేపడుతుందని తృణమూల్ పేర్కొంది. ఈ సమీక్ష ఫలితాల ఆధారంగా అన్ని అనుబంధ సంస్థల సంస్థాగత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని, తగిన సమయంలో నూతన కమిటీలను ప్రకటిస్తామని వెల్లడించింది. భవిష్యత్తు సవాళ్లను నూతన ఉత్సాహంతో ఎదుర్కోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications