తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సవాలే

డిసెంబరులో శ్రీకృష్ణ కమిటీ తమ నివేదిక కేంద్రానికి అందించిన తర్వాత అటు సీమాంధ్రలోనో లేదా ఇటు తెలంగాణలోనే గొడవలు చెలరేగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మొదట ఆయన దృష్టి సారించాల్సిన అంశం ఇదే. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కేవలం 36 రోజులే ఉంది. తెలంగాణతో పాటు ఫ్రీజోన్ కుడా ఆయనకు సవాలే. ప్రభుత్వం ఎస్ఐ పరీక్షల నిర్వహణ ప్రకటించగానే తెలంగాణలో, రద్దు చేయగానే అటు సీమాంధ్రలో విద్యార్థులు ఉద్యమాన్ని లేవదీశారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఫ్రీజోన్ అంశం తేలే వరకు ఎస్ఐ పరీక్షలు రద్దు చేయాలని తెలంగాణవారు, రద్దు చేయకూడదని సీమాంధ్రులు ధర్నాలు రాస్తారోకోలు చేశారు, చేస్తున్నారు. బిఇడి, డిఎస్సీ విద్యార్థుల మధ్య అలుముకున్న వివాదాన్ని పరిష్కరించవలసి ఉంటుంది. పారామెడికల్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా ఆయన ముందున్నాయి.
ఇక ఉద్యోగ సంఘాలను అదుపు చేయటం ఆయనకు మరో ప్రధాన సమస్య. ఇటీవలే ఉద్యోగ సంఘాలు భారీ ఎత్తున ఛలో హైదరాబాదును నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షా ఇరవై వేలమంది జైలుపాలయి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. అలాంటి అతి పెద్ద, ప్రధాన సమస్య ఆయనకు పెద్ద తలబొప్పి కట్టించేదే. పోలవరం, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు జాతీయహోదాకు ఆయన అధిష్టానాన్ని డిమాండ్ చేయవలసి ఉంటుంది. సీమాంధ్రలో హైకోర్టు బెంచ్ అనేది మరో కీలక అంశం. హైకోర్టు తమకు దూరంగా ఉన్నందున బెంచ్ ఏర్పాటు చేయాలని సీమాంధ్ర లాయర్లు గత కొద్దికాలంగా ధర్నాలు, రాస్తారోకో చేస్తున్నారు.
వారికి సీమాంధ్ర ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. వ్యక్తిగత ప్రతిష్ట కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కట్టలు తెగిన చెరువులా ప్రజా సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక అత్యయిక స్థితిలోకి నెట్టారు. శాంతిభద్రతల విషయంలో విఫలమైన రోశయ్య మాత్రం ఆర్థిక స్థితిని మెరుగుపర్చే దిశలో ప్రయత్నాలు చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థికస్థితిని మెరుగుపరిచేందుకు రోశయ్యలాగే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యల దృష్ట్యా ఆయన శాంతిభద్రతసపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications