31 మందితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ మంత్రి వర్గ జాబితాకు ఆమోద ముద్ర వేశారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో చర్చలు జరిపిన తర్వాత జాబితాకు తుది రూపు ఇస్తారని అంటున్నారు. శనివారం సాయంత్రంలోగా తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పలువురిని కలుసుకోవడంలో బిజీగా గడుపుతున్నారు. శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల తర్వాత ఆయన హైదరాబాదుకు బయలుదేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ వర్గానికి చెందినవారికి పెద్దగా మంత్రివర్గంలో చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. అయితే, తమకు సరెండర్ అయిన కొండ్రు మురళి వంటి జగన్ వర్గీయులకు మాత్రం మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలుంటాయని అంటున్నారు. తమకు పూర్తిగా సరెండర్ అయితే తప్ప వైయస్ జగన్ వర్గీయులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకూడదనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ మేరకే కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పది నుంచి పదిహేను కొత్త ముఖాలు ఉంటాయని అంటున్నారు. పాలడుగు వెంకటరావు వంటి పార్టీ విధేయులకు తప్పనిసరిగా మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాస రెడ్డికి మాత్రం మొండిచేయే చూపే అవకాశం ఉంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీ వచ్చిన వైయస్ జగన్ బాబాయ్ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని కలిశారు.












Click it and Unblock the Notifications