శాసనసభ నుంచి చంద్రబాబు సహా టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. రైతు సమస్యలపై చర్చను కొనసాగించాలని పట్టుబడుతూ తెలుగుదేశం సభ్యులు సాయంత్రం శాసనసభా సమావేశంలో పట్టుబట్టారు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. మైక్రో ఫైనాన్స్ నియంత్రణ బిల్లు ప్రతిపాదనకు అడ్డు తగులుతూ తెలుగుదేశ సభ్యులు రైతు సమస్యలపై చర్చ జరపాలని సాయంత్రం సమావేశాల్లో పట్టుబట్టారు. తెలుగుదేశం, అధికార కాంగ్రెసు సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగి గందరగోళ పరిస్థితి నెలకొనడంతో డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలుత 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సజావుగా సాగలేదు.
తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. రైతు సమస్యలపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. గందరగోళం మధ్యనే డిప్యూటీ స్పీకర్ కొన్ని బిల్లులను ఆమోదింపజేశారు. తెలుగుదేశం సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. ఎంతకీ తెలుగుదేశం సభ్యులు వినకపోవడంతో సభ నుంచి తెలుగుదేశం సభ్యులను ఈ సాయంత్రం సమావేశాలకు సస్పెండ్ చేస్తూ తీర్మానం ఆమోదించారు. సస్పెన్షన్ తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్ చేత వారిని బయటకు పంపించి వేశారు.












Click it and Unblock the Notifications