గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కు హైకోర్టులో చుక్కెదురు

Gali Janardhan Reddy
హైదరాబాద్‌: అక్రమ గని తవ్వకాలపై సీబీఐ దర్యాప్తునకు సంబంధించిన వ్యవహారంలో గురువారం ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి హైకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ గని తవ్వకాల వ్యవహారాలపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు అనుమతించింది. సీబీఐ దర్యాప్తును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. ఆ మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, జస్టిస్‌ విలాస్‌ వి.అఫ్జల్‌ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు వెలువరించింది. సీబీఐ దర్యాప్తును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ చేసిన అప్పీళ్లను అనుమతించింది. ఈ తీర్పుతో ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, సుప్రీంకోర్టుకు వెళ్లటానికి వీలుగా తీర్పును కొంతకాలం వాయిదా వేయాలని ఓఎంసీ తరఫు న్యాయవాది కోరారు. సుప్రీంకోర్టుకు క్రిస్‌మస్‌ సెలవులు కూడా ఉన్నందున తీర్పు అమలును 15 రోజుల పాటు వాయిదా వేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. తాజా తీర్పు నేపథ్యంలో సీబీఐ తక్షణం దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయి.

ఓఎంసీ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉదయం వాదనలు కొనసాగిస్తూ - ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం ప్రకారం నోటీఫికేషన్‌ జారీ చేశారని పేర్కొన్నారు. అయితే ఖనిజాల వ్యవహారంలో పోలీసులకు పాత్ర లేదని చెప్పారు. ఎంఎండీఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 22 ప్రకారం అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో పోలీసుల ఇచ్చే నివేదికను మేజిస్ట్రేట్‌ పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టంగా ఉందన్నారు. అందువల్ల సమయం వృథా తప్ప దర్యాప్తు వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారాలపై దర్యాప్తును అధీకృత అధికారి చేయాల్సి ఉందన్నారు. ఎంఎండీఆర్‌ చట్టాన్ని సవరణ చేసేదాకా మైనింగ్‌ వ్యవహారంలో పోలీసుల పాత్ర లేదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత అధికారికి సీబీఐ ఫిర్యాదు చేయవచ్చు కదా అన్ని ప్రశ్నించింది. అంతేగాకుండా ఇలా దర్యాప్తు చేయాలంటూ తాము కేంద్రాన్నిగానీ, సీబీఐనిగానీ ఎలా ఆదేశించగలమంది. దర్యాప్తు అధికారి నివేదికను కోర్టుకే అందజేస్తారని ఎందుకు భావించాలి? సంబంధిత ఉన్నతాధికారికి ఫిర్యాదు చేయవచ్చు కదా? అని ప్రశ్నించింది. పరిశోధన పూర్తయ్యాకనే అధీకృత అధికారి తదితర అంశాలు తెరపైకి వస్తాయి తప్ప.. ఈ దశలో కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలన్న కేసుగా దీన్ని తాము పరిగణించలేమని పేర్కొంది.

సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వివేక్‌ ఠంకా వాదనలు వినిపిస్తూ - ఓఎంసీ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో వాదించిన సీనియర్‌ న్యాయవాది తాము దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను మాత్రమే సవాలు చేస్తున్నామన్నారని, ఎఫ్‌ఐఆర్‌తో సంబంధంలేదని చెప్పారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే కంపెనీకి చెందిన మరో న్యాయవాది ఎఫ్‌ఐఆర్‌ గురించిన అంశాలనే ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో సీబీఐని నియంత్రిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా ఉంటే చెప్పాలని కోరారు. సుప్రీం ఆదేశాల మేరకే సీఈసీ విచారణ చేపట్టిందని, ఏవైనా ఉంటే అక్కడే తేల్చుకోవాలన్నారు. 2009 డిసెంబరు 7న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని, 14న ఇదే హైకోర్టు స్టే మంజూరు చేసిందని చెప్పారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన వారంలోనే ఆగిపోయిందని చెప్పారు. ఫిర్యాదు దాఖలు చేసే సమయంలోనే అధీకృత అధికారి ప్రస్తావన వస్తుందని చెప్పారు. ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 3 కింద ఏడు రకాలైన నేరాలను వివిధ చట్టాల కింద సీబీఐ విచారణ చేపట్టవచ్చని, అందులో మొదటి చట్టం ఎంఎండీఆర్‌ అని చెప్పారు. దీంతో పాటు అటవీశాఖ, అక్రమ మైనింగ్‌, ప్రభుత్వ అధికారుల పాత్ర తదితరాలపై దర్యాప్తు చేయవచ్చన్నారు. ఈ వ్యవహారం కోట్లాది రూపాయలతో ముడిపడి ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు పాత్ర కూడా ఉందని, అవినీతి నిరోధక చట్టం కింద వారిపై విచారణ చేపట్టవచ్చని తెలిపారు. అక్రమ మైనింగ్‌ ద్వారా జాతీయ సంపదను కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు సాక్ష్యం చెప్పినవారు ఇప్పుడు ముందుకు రావడంలేదని, బెదిరించి సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని చెప్పారు. పరిశోధన ద్వారానే వాస్తవం వెలికి వస్తుందన్నారు. ముఖ్యంగా ఎవరు దర్యాప్తు చేయాలన్న అంశాన్ని ఎంచుకునే అధికారం నిందితుడికి లేదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+