వైయస్ జగన్, చంద్రబాబులను కిరణ్ కుమార్ రెడ్డి ఎదుర్కోగలరా?

చంద్రబాబు నిరవధిక నిరాహార దీక్షకు జాతీయ నాయకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ ఇప్పటికే చంద్రబాబుకు మద్దతు తెలిపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, జెడియు నేత దేవెగౌడ శనివారం ఆయనను పరామర్శించడానికి రానున్నారు. విజయవాడ నిరాహార దీక్షను వైయస్ జగన్ తన రాజకీయాలకు వేదికగా మార్చుకోనున్నారు. సాధ్యమైనంత వరకు కాంగ్రెసు శిబిరాలను ఛిన్నాభిన్నం చేయడమే ఆయన లక్ష్యం. ఈ నిరాహార దీక్ష కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీయవచ్చు కూడా.
చంద్రబాబుపై, వైయస్ జగన్ పై కాంగ్రెసు నాయకులు, మంత్రులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. రంగు వెలసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సహా శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని వివేకానంద రెడ్డి చెప్పారు. చంద్రబాబు, జగన్ లపై కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తన అక్రమ సంపాదనలోంచి వైయస్ జగన్ రైతులకు సాయం చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. చంద్రబాబుపై మంత్రి కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వైయస్ జగన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగారు. ఇతర కాంగ్రెసు నాయకులు కూడా చంద్రబాబు, జగన్ లను ఎదుర్కునే ప్రయత్నం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఇలా ఎంత మంది మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, నాయకులు తోడుగా నిలుస్తారనేది రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications