కాంగ్రెసు తెలంగాణ నాయకులకు లాగులు తడుస్తున్నాయి: కెసిఆర్

1956 వరకు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను పోగొట్టి ఆంధ్రతో విలీనం చేసింది ఇక్కడి కాంగ్రెస్ నాయకులే అన్నారు. ఇప్పుడు 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను వూడగొట్టింది కూడా ఇక్కడి కాంగ్రెస్ నాయకులేనన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏమీ చేతకాదని, కనీసం గ్రూప్-1 పరీక్షలను ఆపించలేక పోయారని, తెలంగాణకు నష్టం కల్గించే ప్రాజెక్టులను నిలువరించలేక పోయారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై కేసులు నమోదు చేస్తే వారి గురించి పట్టించుకోలేదని, తెరాస ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లే కనీసం మద్దతు ఇవ్వలేక పోయారని మండిపడ్డారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై కేసీఆర్ మొదటిసారి నేరుగా మండిపడ్డారు. 'డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుంది? జనవరి 1 వస్తుంది' అన్న గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ వ్యాఖ్యలు వెటకారంగా ఉన్నాయన్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న ఆయన అలా మాట్లాడడం తగదన్నారు. డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 వస్తుందన్నది తమకూ తెలుసన్నారు. ఇక డీజీపీ అరవిందరావు తీరును కేసీఆర్ తప్పుపట్టారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని దృష్టిపెట్టుకొని అదనపు బలగాలను తెప్పిస్తున్నట్లు ఆయన చెప్పడం సరికాదని, పోలీసు లాఠీ, తూటాలకు తెలంగాణ ప్రజలు భయపడబోరని స్పష్టం చేశారు. ఆయనకు నిబద్ధత ఉంటే తమ సభకు హాజరైన ప్రజలు ఫోటోను, ప్రజల అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలని, తెలంగాణ ఇస్తే గొడవ ఉండదని నివేదించాలని సూచించారు. నల్గొండలో వెకిలిమంత్రి ఒకరు మహాగర్జన సభ ఉన్నందున దాన్ని ప్రజలు చూడకుండా విద్యుత్ సరఫరా నిలిపి వేయించారని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని సలహా ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు నారాజ్ కావద్దని, ఆగం కూడా వద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కరుకుగా ఉందామని, కీలెరిగి వాతపెడ్దామని చెప్పారు. 'ఔర్ ఏక్ ఢక్కా.. తెలంగాణ పక్కా' అని, కొట్టే ఢక్కా పక్కాగా ఉండాలన్నారు. ఢక్కా కొట్టే క్రమంలో కింద పడొద్దన్నారు. తెలంగాణ తెదేపా నాయకులు చంద్రబాబును నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే ఉంటుందని వ్యాఖ్యానించారు. సకల సమస్యలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమన్నారు.తెలంగాణవ్యాప్తంగా ఇంటికి ఒక్కరు చొప్పున 25 లక్షల మందికి పైగా సభకు హాజరయ్యారని కేసీఆర్ అన్నారు. జనం సముద్ర కెరటాల్లా వచ్చారని, దేశచరిత్రలో ఇంతపెద్ద సభ ఎక్కడ జరగలేదని కేసీఆర్ చెప్పారు.
తాను ఆంధ్రా ప్రాంతంలోని శ్రీకాకుళంలో పుట్టానని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నానని అఖిల భారత ఆర్యసమాజ్ అధ్యక్షులు స్వామి అగ్నివేశ్ చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటంలో న్యాయం ఉందని, ఇది సహేతుకమైన సుదీర్ఘ పోరాటమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో సుదీర్ఘంగా ఉన్న చీకటి తొలగనుందని, తెలంగాణ పోరాటానికి జాతిమొత్తం వెన్నంటి నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి జాతీయ స్థాయిలో ఏమాత్రం బాగోలేదన్నారు. 55 ఏళ్ల తెలంగాణ యుద్ధానికి ఇది చివరి అంకమన్నారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుంటే రెండుచోట్ల పార్టీ తుడిచి పెట్టుకుపోతుందని హెచ్చరించారు. వీలైనంత త్వరగా ఆయన తెలంగాణ ప్రజల పక్షాన ఉంటామని ప్రకటించాలన్నారు. కేంద్రం 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనను ఆంధ్ర ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మైనింగ్ మాఫియా అడ్డుకుందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మైనింగ్‌పై ప్రజలకే పూర్తి హక్కు ఉండాలన్నారు. కర్ణాటక తరహాలో లోకాయుక్తను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దేశంలో తనకు తెల్సినంత వరకు ఇంత భారీసభ ఎక్కడా జరగలేదన్నారు. ఈ వేదిక ద్వారా దేశానికి తెలంగాణ ప్రజలు తామంతా ఏకతాటిపై ఉన్నామన్న గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications