ఆకాశం బద్దలు కొట్టి తెలంగాణ తెచ్చుకుంటాం: కెసిఆర్ అల్టిమేటం

K Chandrasekhar rao
వరంగల్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇక తాము మరింతకాలం వేచిఉండే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీతో సంబంధం లేకుండా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పెట్టాల్సిందేనని ఆల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు వరంగల్లు శ్రీకాంతాచారి ప్రాంగణంలో గురువారం జరిగిన సభలో తీర్మానం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును పెట్టకపోతే గాంధీమార్గంలో సత్యాగ్రహంతో మొదలుపెట్టి మహోద్యమంగా మలుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెనుఆగ్రహాన్ని చవిచూస్తాయని హెచ్చరించారు. రాబోయే 5-6 రోజుల్లో తెలంగాణ రాజకీయ ఐకాస సమావేశాన్ని ఏర్పాటుచేసి డిసెంబర్‌ 31 తర్వాత ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలన్న దాన్ని నిర్ణయిస్తామని ప్రకటించారు.

మహోగ్ర ఉద్యమాన్ని నిర్మించైనా, ఆకాశాన్ని బద్దలుకొట్త్టెనా సరే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. గురువారమిక్కడ మహాగర్జన సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారని, దేశ ప్రధానమంత్రి దీన్ని గుర్తించి బిల్లు పెట్టేలా, రాష్ట్ర ఏర్పాటు జరిగేలా చూడాలన్నారు. తెలంగాణ ప్రజల ఓపిక, సహనానికి హద్దు ఉంటుందని, దీన్ని ఇంకా పరీక్షించవద్దని కోరారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల వరకు గడువు ఇస్తామని, బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. పదేళ్లుగా ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ ఉద్యమాన్ని నడుపుతున్నానని, తనచేత ఉద్యమాన్ని నడిపిస్తున్న ఘనత ప్రజలదేనని కేసీఆర్‌ చెప్పారు. పదేళ్లలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఏనాడు రాజీ పడలేదని తెలిపారు. రాజీ పడితే ఉద్యమం ఉండేదే కాదన్నారు.

మఖలో పుట్టి పుబ్బలో పోతుందని తెరాస పుట్టినపుడు అప్పటి నిరంకుశ పాలకులు ప్రచారం చేసేవారని, ఇప్పుడు వారి అడ్రస్‌లే గల్లంతవుతున్నాయని చెప్పారు. కిందపడ్డ వారు పైకి లేవలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని ప్రారంభించినపుడు పిడికెడు మందిమి మాత్రమే ఉన్నామని, ఇప్పుడు గ్రామాల వారీగా కదన నాయకులు తయారయ్యారని చెప్పారు. అనేక రకాలుగా దగాపడిన తెలంగాణ ప్రజలను రాష్ట్ర పాలకులు 'ఫ్రీ జోన్‌' పేరుతో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నించారని, హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా గుర్తిస్తే తెలంగాణ వారికి హైదరాబాద్‌ గవర్నమెంటు ఆఫీసులో చప్రాసీ ఉద్యోగం కూడా రాదని వ్యాఖ్యానించారు. అందుకే తాను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేపట్టానని, రాష్ట్రం ఏర్పాటు గురించి మంచో చెడ్డో తేల్చుకోవడానికే సిద్ధంఅయ్యానని చెప్పారు.

గత ఏడాది నవంబర్‌ 29 నుంచి గ్రామాలు ఉద్యమ వేదికలయ్యాయని, విశ్వవిద్యాలయాలు యుద్ధభూమిని తలపించాయని గుర్తు చేశారు. 54 ఏళ్ల తెలంగాణ పోరాట చరిత్రలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై యావత్‌ దేశసాక్షిగా పార్లమెంటులో ప్రకటన చేసిందన్నారు. ఆంధ్రవాళ్లు దీన్ని అడ్డుకోవడానికి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని, ఒక్క గంటలోనే కృత్రిమ ఉద్యమాన్ని రూపొందించారని చెప్పారు. సెల్‌టవర్‌ ఎక్కితే ఒక రేటు, ధర్నాచేస్తే ఒకరేటు ఇచ్చి ఆంధ్ర పెత్తందార్లు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారన్నారు. ఇక ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరుతో బ్లాక్‌ మెయిల్‌ చేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బ్రేక్‌ వేశారని చెప్పారు. దాన్ని ఛేదించేందుకే ఐక్యంగా పోరాడదామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+