కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారా?

ఒక వర్గం రాజీనామాలకు సిద్ధపడుతుండగా, మరో వర్గం ఆ అవసరం లేదని చెబుతున్నట్లు చెబుతోంది. కొద్ది మంది రాజీనామాలకు సిద్ధపడినా కేంద్ర ప్రభుత్వానికి ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయి. తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష చేసిన సందర్భంలో కె. కేశవరావు ప్రకటించారు. అందులో తీవ్రత కూడా ఉంది.
కొంత మంది పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడానికి చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో తెలంగాణ పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి ఆహ్వానించింది. బుధవారం మూడు గంటలకు ప్రణబ్ ముఖర్జీతో వారు సమావేశం కావాల్సి ఉంది. అయితే, ఆ సమావేశాన్ని సాయంత్రం ఏడు గంటలకు వాయిదా వేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యానే సమావేశం కొన్ని గంటలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈలోగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెందిన నేతలందరితో సమావేశమయ్యారు. తనతో జరిగే సమావేశంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులకు ప్రణబ్ ముఖర్జీ క్లాస్ తీసుకుంటారనే వార్తలు కూడా వచ్చాయి.
ప్రణబ్ ముఖర్జీ క్లాస్‌కు, ఇతర అధిష్టానం నేతల మాటలకు వారు తలొగ్గుతారా, లేదంటే రాజీనామాలకు సిద్ధపడతారా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులపై మాత్రం తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా లేకుంటే తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గానీ శాసనసభ్యులు గానీ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలుగుదేశం శాసనసభ్యులు కొంత మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వెళ్లిపోతున్నారు. కాంగ్రెసుకు కూడా అదే పరిస్థితి ఎదురు కావచ్చు. ఏమైనా, కాంగ్రెసు అధిష్టానానికి తెలంగాణ సమస్య గోరు చుట్టుపై రోకటి పోటు లాంటిదే.












Click it and Unblock the Notifications