శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఇప్పుడు మాట్లాడను: సిఎం కిరణ్ కుమార్

కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల్లో విభజన లేదని, వారందరితో తాను మాట్లాడానని, వారి వారి ప్రాంతాల ప్రజల అభిప్రాయాల మేరకు మాత్రమే వారు మాట్లాడుతున్నారని, పార్టీ నాయకత్వం వారితో మాట్లాడుతుందని ఆయన అన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం గైర్హాజరవుతున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆ విషయం తనకు తెలియదని ఆయన చెప్పారు. రేపటి అఖిల పక్ష సమావేశంలో తాను పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై వాదనలు వినిపించడానికి 9 రోజుల సమయం ఉందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. డెల్టా పరిరక్షణ సమితి ప్రతినిధులు తనతో మాట్లాడారని, తాను సాంకేతిక నిపుణులతోనూ అఖిల పక్ష నేతలతోనూ మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
రాష్ట్రానికి చెందిన పలు సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని క్లియర్ చేయించుకోవడానికే తాను ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం తదితర కేంద్ర మంత్రులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినట్లు ఆయన చెప్పారు. సోనియాతో మాట్లాడిన రాజకీయ విషయాలు తాను వెల్లడించబోనని ఆయన అన్నారు


Click it and Unblock the Notifications