హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యమం చల్లబడలేదు, అదును చూసి రుచి చూపిస్తాం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్:"తన్నుకోవడం, తగులబెట్టుకోవడం, తగలబెట్టడమే ఉద్యమమా? శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉద్యమిస్తుంటే చల్లబడిందంటారా? ఇదో పెద్ద కుట్ర" అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అన్నారు. ఉద్యమం వెనకపట్టు పట్టిందని విమర్శించే వారికి తెలంగాణ వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు నిర్వహిస్త్ను శాంతియుత నిరసన దీక్షలు కన్పించడం లేదా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ విద్యావంతుల వేదిక రూపొందించిన 2011 డైరీని కేసీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం 'తెలంగాణ వర్తమాన ఉద్యమం-మన కర్తవ్యం'పై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 1969లో జరిగిన ఉద్యమంతో పోలిస్తే ప్రస్తుత ఉద్యమం తన స్వరూపాన్ని మార్చుకుందని కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటి ఉద్యమం అదిరిపోయే, బెదిరిపోయేది కాదని స్పష్టం చేశారు. వ్యూహాత్మకంగా కదులుతున్నామని చెప్పారు. "ఎందుకు అనవసర లొల్లి అనుకొని ఐకాస ఛైర్మన్‌ కోదండరాం సాదాసీదా ఉద్యమ స్వరూపాన్ని రూపొందించి ప్రకటించారు. ఒక వేళ పరిస్థితిలో తేడావస్తే అంకుశాన్ని అందుకుంటార"ని కేసీఆర్‌ తెలిపారు.

ప్రస్తుతం ఉద్యమం చల్లబడలేదు. వెచ్చబడలేదు. ఎప్పుడు..ఎక్కడ కొట్టాలో తెలుసు. మళ్లీ పిడుగు పడుతుంది. ఉద్యమం ఆరిపోయిందని అనుకునేవాళ్లు సన్నాసులే అవుతారని చెప్పారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక రాష్ట్రం మినహా మరోటి కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. చంటి పిల్లల నుంచి పండుముసలి వరకు ఉద్యమంలో కదిలివస్తున్నారని చెప్పారు. ఉద్యమాన్ని గందరగోళం చేయడానికి వలసవాదులు, ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తుంటారని, ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. పదేళ్లుగా ఉద్యమం కొనసాగుతుందని, మరో పదేళ్లయినా రాష్ట్రం కోసం కొట్టాడేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతిమ విజయం ప్రజలదేనన్నారు.

'రచ్చ బండ' పేరుతో ప్రభుత్వం చేపడుతున్నది ఓ రొచ్చు కార్యక్రమమని కేసీఆర్‌ విమర్శించారు. ప్రజలను ప్రలోభపెట్టే చిల్లర కార్యక్రమంగా అభివర్ణించారు. రచ్చబండకు వచ్చే ప్రజాప్రతినిధులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చచ్చు రేషన్‌కార్డులు ఇస్తామని ప్రేమ ఒలకబోస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ వస్తే మా కార్డులు, పెన్షన్లు మేం తీసుకుంటాం అని చెప్పారు. మీరు (తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు) చేసే దిక్కుమాలిన పనివల్ల నవ్వినవారి ముందు జారిపడ్డట్లు అవుతోందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X