హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకాపై వి హనుమంతరావు, బొత్స సత్యనారాయణ ఎదురు దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్/ న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ సీనియర్ నేత జి. వెంకటస్వామి (కాకా)పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు ఎదురు దాడికి దిగారు. సోనియాపై విమర్శలు చేయదలుచుకుంటే వెంకటస్వామి, ఆయన కుమారుడు రాజీనామా చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఎవరింటికి ఎవరు వెళ్లారనేది ముఖ్యం కాదని, మర్యాదపూర్వకంగా ఆంటోనీ చిరంజీవి ఇంటికి వెళ్లారని ఆయన చెప్పారు.

తాను చిరంజీవి ఇంటికి వెళ్తే చిన్నవాడిని అయిపోతానా ఆయన అడిగారు. సందర్భం, సమయాన్ని బట్టి వ్యవహారం చేస్తారని ఆయన అన్నారు. మంచి జరగాలని కాంగ్రెసు కార్యకర్తగా, నేతగా పరిణామాన్ని ఆహ్వానించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వెంకటస్వామి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పొత్తులు రాజకీయాల్లో సహజమని, ఆలోచనలు, సిద్ధాంతాలు కలిసినప్పుడు పొత్తులుండవచ్చు, విలీనాలు జరగవచ్చునని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనంపై చర్చలు జరిగాయని ఆయన చెప్పారు.

వెంకటస్వామి వ్యాఖ్యలపై వి. హనుమంతరావు ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే ఆగ్రహంతోనే కాకా సోనియాపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైయస్ ఒక్కోసారి కాకా విమర్శించి, ఆ తర్వాత పొగుడుతుండేవారని ఆయన అన్నారు. ఎందుకు ఆలా చేసేవాడో తెలియదని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా సోనియాపై తాను ఆలా అనలేదని కాకా చెప్పవచ్చునని ఆయన అన్నారు. అవినీతి గురించి మాట్లాడుతున్న కాకా తన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడరని ఆయన అడిగారు. కాకా అలాంటి విమర్శలు చేస్తే కాంగ్రెసు కార్యకర్తలు సహించరని ఆయన హెచ్చరించారు.

కాకాలాంటి నేతలు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఆంటోనీ చిరంజీవి ఇంటికి వెళ్లడం కాకాకు అభ్యంతరం కాదని, తనను సంప్రదించకుండా హైదరాబాదు వచ్చి చిరంజీవి ఇంటికి వెళ్లడమేమిటని అక్కసు కావచ్చునని ఆయన అన్నారు. ఏమైనా అంటే తాను సీనియర్‌ను అంటారని ఆయన అన్నారు. సిడబ్ల్యుసిలో ఉండి ఒక్కసారైనా తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడారా, ఇంత మంది విద్యార్థులు చనిపోతున్నారంటూ తెలంగాణ ఇవ్వాలని సోనియాకు ఏనాడైనా చెప్పారా అని ఆయన అడిగారు. తనను కూడా తీసుకుని చిరంజీవి ఇంటికి ఆంటోనీ వెళ్తే కాకా సంతోషించేవాడని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X