చిరంజీవితో పొత్తుకు వైయస్సార్ లేఖ రాశారు: ఉండవల్లి అరుణ్ కుమార్

వైయస్ మరణం తర్వాత బలహీనపడిన కాంగ్రెసు చిరుతో దోస్తీకి సిద్ధమవుతుందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేను ఈ లేఖను ఇప్పుడు బయట పెడుతున్నానని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండోరోజునుంచే పీఆర్పీ పొత్తు గురించి వైయస్ ప్రస్తావన తీసుకు వచ్చారన్నారు. సీక్రెట్ లేఖను బయటపెట్టడంపై ఓ విలేకరి ప్రశ్నించగా, రాజకీయాల్లో సీక్రెట్లు ఏమీ ఉండపన్నారు. సీక్రెట్ ఉండాలనుకుంటే రాజకీయాల్లోకి రావద్దన్నారు. కాంగ్రెసుకు వచ్చిన ఓటింగ్ నష్టాన్ని పూడ్చడానికి వైయస్ చిరుతో పొత్తుని ప్రస్తావించారన్నారు. చిరుకు సెంట్రల్ కాబినెట్‌లో చోటివ్వాలని వైయస్ స్వయంగా చెప్పారన్నారు. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు సైతం రాష్ట్రంలో మంత్రి పదవులు ఇవ్వవలసి ఉంటుందన్న అభిప్రాయాన్ని వైయస్ ఆ లేఖలో వ్యక్తం చేశారన్నారు. చిరంజీవి ఇప్పుడు కొత్తగా మద్దతు తెలపడం లేదని గత రాజ్యసభ ఎన్నికలలోనూ మద్దతు ఇచ్చారని తెలిపారు.
సోనియా కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తేలేకపోయిందన్న వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ఇటీవల ఒక్క రాజస్థాన్‌లో తప్పితే అన్ని రాష్ట్రాల్లో అధికారలో ఉన్న పార్టీలే గెలిచాయన్నారు. చిరుతో పొత్తు వల్ల కాంగ్రెసుకు ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెసు తన సిద్ధాంతాలను వదులుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక తెలంగాణకు, చిరంజీవితో పొత్తుకు సంబంధం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైయస్ ఉన్నప్పుడే పీఆర్పీ అంకురార్పణ జరిగిందని చెప్పకపోవటం తప్పు అవుతుంది కాబట్టే చెబుతున్నానన్నారు. దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభమైన నేపథ్యంలో కలిసి వచ్చే పార్టీలతో వెళ్లడం తప్పు కాదన్నారు. ఒకసారి టిఆర్ఎస్‌తో, మరోసారి కమ్యూనిస్టులతో కలిసి వెళ్లామని ఇప్పుడు పీఆర్పీతో వెళుతున్నామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగా ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చన్నారు. అయితే అధినేత్రిని విమర్శించడం సరికాదన్నారు.
కాకా వృద్ధాప్యం వల్లే సోనియాపై అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. సోనియాను కాంగ్రెసు పార్టీ బతిమాలి పిలిపించుకుందని అలాంటి వ్యక్తిని అనడం సరికాదన్నారు. అయితే వైయస్‌ను ఆయన బతికి ఉన్నప్పుడే అవినీతి పరుడు అని కాంగ్రెసులోని వ్యక్తులు అన్నారని, ఇప్పుడు అంటున్నారని, అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగా అలా అనే వారిపై తానేమీ స్పందించను అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ ప్రభుత్వంపై ఎవరూ అసంతృప్తి ప్రదర్శించడం లేదన్నారు. 2014 వరకు ప్రభుత్వానికి ఢోకా లేదన్నారు. 30 ఏళ్ల కాంగ్రెసు జీవితంలో నేను ఓసారి అసంతృప్తికి లోనయ్యానని, ఇవన్నీ సహజమేనని చెప్పారు. సోనియా దయతోనే వైయస్ నేషనల్ ఫిగర్ అయ్యారని అన్నారు.