కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నష్టాన్ని చిరంజీవి భర్తీ చేస్తున్నారా?

జగన్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో కొందరు నాయకులు ఆందోళనకు గురయ్యారు. జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు కావటంతో సాధారణంగానే ఆయన వెంట చాలామంది వెళ్లే అవకాశాలు ఉన్నందున కొందరు నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా ఆ నష్టాన్ని చాలావరకు తగ్గించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని భావిస్తున్నారు.
కాగా మరికొందరు మాత్రం చిరంజీవి రాకతో తమ తమ జిల్లాల్లో నష్టం వాటిల్లే ప్రమాదముందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్య నేతలైన కళా వెంకట్రావు, తమ్మినేని సీతారాం వంటివారు పీఆర్పీ ఆవిర్భావంతో టిడిపినుండి మారారు. ఇలా టిడిపినుండి వచ్చిన వారు చిరుతో పాటు కాంగ్రెస్‌వైపు చూడకుండా తమ మాతృపార్టీ అయిన టిడిపివైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం టిడిపినుండి పీఆర్పీలోకి వెళ్లిన వారిని బాహాటంగా ఆహ్వానించారు. ఇక విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరావు జగన్ వెంట వెళుతున్నందున కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్సుడుగా మారింది. విశాఖపట్టణంలో ఎంపీ సబ్బం హరి, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ వంటి వారు జగన్‌తో వెళుతున్నారు.
ఇంతకుముందు టిడిపినుండి రెండుసార్లు గెలిచిన గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు మళ్లీ మాతృపార్టీలోకి వెళ్లడం కన్నా చిరుతో పాటు కాంగ్రెస్ వైపు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీకి లాభం ఉన్నప్పటికీ స్థానిక నేతలు మాత్రం ఎక్కడ వారి అవకాశాలు దెబ్బతీస్తారో అని ఆమోదించలేక పోతున్నారు. కృష్ణా జిల్లాలో కూడా పీఆర్పీ విలీనం కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.
ఇక చిరు అత్తగారి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో చిరు స్వయంగా ఓడిపోయారు. ఇక్కడ కాపుల డామినేషన్ ఉన్నప్పటికీ చిరు ప్రభావం అంతంత మాత్రమే కనిపిస్తోంది. ఇక గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా చెప్పుకోదగ్గ లాభం కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేనట్టుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications