కెసిఆర్‌తో పోటీకి రెడీ అయిన తెలంగాణ కాంగ్రెసు నేతలు

లోకసభలో వారు గళమెత్తారు. దీంతో వెంటనే పార్టీ అధిష్టానం కదిలింది. పార్లమెంటు సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అధికార పార్టీ సభ్యులమై ఉండి కూడా తాము లోకసభలో ఆందోళనకు దిగామని, తెలంగాణపై పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు.
రైల్వే, సాధారణ బడ్జెట్‌లకు ఆటంకాలు కలిగించవద్దని పార్టీ అధిష్టానం తమను కోరిందని, అందుకే లోకసభను స్తంభింపజేసే కార్యక్రమాన్ని నిలిపేశామని, మార్చి 1వ తేదీ నుంచి తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రుల్లో కూడా కదలిక వచ్చింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ 15 మంది మంత్రులు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు.
ఈ లేఖపై హైదరాబాదుకు చెందిన మంత్రి ముఖేష్ సంతకం చేయలేదు. కాగా, ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల్లో, ఎమ్మెల్సీల్లో కూడా కదలిక వచ్చింది. శాసనసభలో తెరాస, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతో కలిసి శాసనసభ కార్యక్రమాలను శుక్రవారం నుంచి అడ్డుకోవాలని నిర్ణయించారు. మొత్తం మీద, కెసిఆర్, విజయశాంతి చర్య వల్ల కాంగ్రెసులో కదలిక వచ్చింది. తెరాస సభ్యులకు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సభ్యుల మద్దతు కూడా లభిస్తోంది.
దీంతో తెలంగాణ పార్లమెంటులో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అంశాన్ని గురువారం బిజెపి రాజ్యసభలో ప్రస్తావించింది. ఎన్‌డిఎ నాయకుల విజ్ఞప్తితో లోకసభలో తమ ఆందోళనను విరమించుకున్న కెసిఆర్, విజయశాంతి హైదరాబాదు చేరుకున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మళ్లీ లోకసభను స్తంభింపజేసే కార్యక్రమం ఉంటుందని కెసిఆర్ చెప్పారు.
కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా ఇదే తేదీని ఇస్తున్నారు. మరోవైపు, తెలంగాణ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చాలని కాంగ్రెసు సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానాన్ని కోరారు. అంతేకాకుండా, తెలంగాణలో ఉద్యమాల వల్ల ప్రజాజీవనం స్తంభించే పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తుందనే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications