సోనియాను కలవనున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ డిమాండ్‌తో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ మంత్రులు సైతం ఢిల్లీ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న ఢిల్లీ నేతలు.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో కిరణ్‌కు సూచించనున్నారు. ముందుగా సొంతపార్టీ నిరసనల సెగను తగ్గించేందుకు రాజకీయ వ్యూహాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ సీఎం పదవిని భర్తీచేసే దిశగా అధిష్టానం చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జె.గీతారెడ్డిలు ఈ పదవిని ఆశిస్తుండగా రాజనర్సింహవైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలావుండగా కిరణ్ కేబినెట్లోని పలువురు మంత్రులు తమ శాఖలపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ల మద్దతు పొందేందుకు వీలుగా మంత్రివర్గంలో మార్పులుచేర్పులపై కూడా అధిష్టానం కిరణ్‌కు ఆదేశాలిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు కీలకమైన శాఖలు తెలంగాణాకే కేటాయించే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగానే ఈ మార్పులు జరగవచ్చని తెలుస్తోంది.