హైదరాబాద్: వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేసిన వేల కోట్ల రూపాయల విలువైన ఇనుప ఖనిజం లీజుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ వూపందుకుంది. లీజుల కేటాయింపులో కీలకపాత్ర వహించిన అప్పటి గనులశాఖ సంచాలకులు, ప్రస్తుత ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ రాజగోపాల్‌ను సీబీఐ అధికారులు మంగళవారం ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరో రెండురోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. వైయస్ సన్నిహితుడు గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ సంస్థకు అనంతపురం జిల్లా ఓబుళాపురంలో ఇనుప ఖనిజం లీజులను కట్టబెట్టటంలో గనులశాఖ నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై సీబీఐ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పట్లో పరిశ్రమలశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మిని కూడా సీబీఐ ఇటీవలే ప్రశ్నించింది.
తాను గనులశాఖ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో తీసుకున్న వివిధ నిర్ణయాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారని రాజగోపాల్ వెల్లడించారు. అన్ని విషయాలూ వెల్లడిస్తానని, ఎలాంటి దాపరికాలూ లేవని ఆయన సిబిఐ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులతో అన్నారు. అక్రమ తవ్వకాల గురించి అడిగారా అన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఏమీ చెప్పలేనని, త్వరలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తానన్నారు.
CBI recorded mining department former director Rajagopal's statement in mining lease issue. It is said that he awarded lease permits to YSR close associate Gali Janardhan Reddy's OMC surpassing rules.
Story first published: Wednesday, March 2, 2011, 9:07 [IST]