మేం వెళ్లిపోతే తెలంగాణకు మిగిలేది మొండి గోడలే: రాయపాటి

సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించాలని తమ పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తోందని చెప్పారు. అందువల్ల తెలంగాణవారు కొంత కాలం ఆగాలని, తొందరపడితే వారికే నష్టమని తెలిపారు. తెరాస నేతలు, కోదండరాంలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నుతున్నారని రాయపాటి తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను ఊళ్లల్లోకి రానివ్వబోమని కోదండరాంలాంటి వాళ్లు ఒత్తిడి తేవడంవల్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని, లేదంటే వారంతా పార్టీకి విశ్వాసపాత్రులేనని అన్నారు.
తెలంగాణపై నిర్ణయం తీసుకోలేమని కాంగ్రెస్ చెప్పినప్పుడే రాజీనామాలపై ఆలోచించాలని సూచించారు. తాము సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేయబోమని, తెలంగాణవాళ్లూ చేయాలని కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. ఒకవేళ తాను రాజీనామా చేసినా తమ ప్రాంతంలో తనకు పుట్టగతులుండవని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే తప్పేమిటని రాయపాటి ప్రశ్నించారు. తెలంగాణ నాయకులు వారానికోసారి ఢిల్లీకొచ్చి సమావేశాలు పెట్టుకోవడంలేదా అని నిలదీశారు.