తెలంగాణపై కాంగ్రెసు కాలయాపన మంత్రమే, కామత్ ప్రకటనతో స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై సంప్రదింపులు జరపడానికి హోంశాఖ 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ కోసం మార్చి 4వ తేదీ వరకూ రూ.20,15,86,242 ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏడు విధివిధానాలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితులను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత స్థానిక, ప్రాంతీయ, జాతీయ దృక్కోణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరు ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కమిటీ ఏర్పాటుకు ముందు సంప్రదింపుల మార్గసూచి, అందుకు అవసరమైన యంత్రాంగం ఏర్పాటుపై హోంమంత్రి 2010 జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 6న మరో సమావేశం నిర్వహించి శ్రీకృష్ణ కమిటీ నివేదికను అందజేసి దానిపై వారి అభిప్రాయాలు కోరినట్లు వివరించారు.
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత తేలుస్తామని కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ప్రజాప్రతినిధులకు చెబుతున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా అది సాధ్యమయ్యేది కాదు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అఖిల పక్ష సమావేశానికి కూడా తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి హాజరు కాకపోవచ్చు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందువల్ల ఇప్పట్లో తెలంగాణ అంశాన్ని తేల్చే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం లేదని తెలుస్తోంది.