హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో తెలంగాణవాదులు రెచ్చిపోయారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావుపై దాడులు చేశారు. మిలియన్ మార్చ్ సందర్భంగా టాంక్ బండ్ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు యాష్కీ పోలీసులను ఛేదించుకొని ట్యాంక్ బండ్‌పైకి చేరుకున్నారు. అయితే పలువురు తెలంగాణవాదులు మధుయాష్కీని రాజీనామా చేయాల్సిందిగా నిలదీశారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇవ్వని కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాగా కేశవరావుకు అంతకంటే ఎక్కువ పరాభవం ఎదురయ్యింది. మిలియన్ మార్చ్‌కు మద్దతు తెలిపేందుకు వచ్చిన కేకేపైకి పలువురు తెలంగాణవాదులు చెప్పులతో దాడి చేశారు. కెకె వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. తెలంగాణకోసం అందరూ కలిసి రావాలని, తెలంగాణ ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని వీడాలని వారు డిమాండ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్‌కు వెళ్లాలన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు యెండల లక్ష్మినారాయణను పోలీసులు అడ్డుకట్టవేశారు. న్యూఎమ్యెల్యే క్వార్టర్స్ వద్ద లక్ష్మినారాయణను పోలీసులు అడ్డగించారు. దాంతో ఆయన కారు నుంచి దిగ కపోవడంతో పోలీసులు ఆయన కారు టైర్ల నుంచి గాలిని తీసివేశారు. లక్ష్మినారాయణను అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.