విగ్రహాల ధ్వంసంపై కోదండరామ్ సమాధానం చెప్పాలి: సీమాంధ్ర టిడిపి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మిలియన్ మార్చ్‌ను ప్రశాంతంగా నిర్వహించుకుంటామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేసిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఇప్పుడు వివరణ ఇవ్వాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిమాండ్ శుక్రవారం చేశారు. శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తామని చెప్పి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుల విగ్రహాలను పూర్తిగా ధ్వంసం చేశారని ఇది చాలా విచారకరమని వారు అన్నారు. టాంక్‌బండ్ పైన ధ్వంసమైన విగ్రహాలను ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, పయ్యావుల కేశవ్, అశోక్ గజపతి రాజు, గాలి ముద్దు కృష్ణమనాయుడు తదితరులు ఉదయం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
విగ్రహాల ధ్వంసానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగు జాతికి అవమానకరమైన రీతిలో విగ్రహాల ధ్వంసం జరిగినందుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తూ తెలుగు వారికి వివరణ ఇవ్వాలన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పి తెలుగు జాతిని కించపర్చే విధంగా ప్రవర్తించినందుకు కోదండరామ్ సమాధానం చెప్పాలని అన్నారు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే ముందస్తు పథకంతో విగ్రహాలను ధ్వంసం చేశారని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడంతో పాటు వారి విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్న కెమెరామెన్‌పై కూడా దాడి చేశారని ఆరోపించారు. విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా హేయమైన చర్యగా అభివర్ణించారు.