వైయస్సార్ పార్టీ స్థాపనకు జగన్ ఎందుకు తొందరపడ్డారు?

పార్టీ స్థాపనలో జరుగుతున్న జాప్యం వల్ల నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీ స్థాపన జరుగుతుందా, లేదా అనే సందేహాలు కూడా తలెత్తే స్థాయి వచ్చేసింది. ఇది ఆయన నిర్ణయానికి ఒక కారణం. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం తేల్చిన తర్వాతనే ఆయన పార్టీని స్థాపిస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణపై తన వైఖరిని ప్రకటించాల్సిన అనివార్యత ఏర్పడుతుందనే ఆయన ఆగుతున్నారని అనుకుంటున్నారు. అది తదనంతర కాలంలో తెలంగాణలో ఆయనకు వ్యతిరేకతగా పనిచేసే ప్రమాదం ఉంది. దీనివల్ల కూడా ఆయన తొందరపడినట్లు కనిపిస్తున్నారు. ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వివిధ అంశాలపై తన వైఖరిని ప్రకటించాల్సిన ఆగత్యం నుంచి ఆయన తప్పుకున్నారని అనుకోవాలి. తెలంగాణ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి కీలకమైన అంశాలపై వైఖరిని దాటవేయడానికి అనువైన తేదీని ఆయన ఎంచుకున్నట్లు భావించవచ్చు.
ఇదిలా వుంటే, జ్యోతిష్యం కూడా పార్టీ స్థాపనకు మరో కారణమని చెబుతున్నారు. మార్చి రెండో వారంలోగా పార్టీని స్థాపించాలని వారు సలహాలు ఇచ్చారని చెబుతున్నారు. మార్చి రెండో వారం దాటితే మంచిది కాదని చెప్పారని అంటున్నారు. దీంతో ఆయన మార్చి 12వ తేదీని అనువైనదిగా అనుకున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద, పార్టీని అనూహ్యంగా భారీ ఏర్పాట్లు లేకుండా జగన్ ప్రకటించడం మాత్రం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది.












Click it and Unblock the Notifications