హైదరాబాద్: శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైఖరిపై మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. భూ కేటాయింపులపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు అంగీకరించిందని సోమవారం శాసనసభలో అన్నారు. ప్రభుత్వం చర్చకు అంగీకరించినప్పటికీ విపక్షాలు జెఎల్పీ కోసం పట్టుబడటం సరికాదన్నారు. సభ జరగాలని ప్రతిపక్షాలకు లేదన్నారు. ప్రజా సమస్యలపై విపక్షాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అందుకే వారు సభను జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. వారు సహకరించక పోవడం విచారకరమన్నారు.
భూకేటాయింపులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పినప్పటికీ విపక్షాలు రాద్దాంతం చేయడం సరికాదని మరో మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. భూకేటాయింపులపై సభా సంఘం వేయడం కుదరదన్నారు. కాగా అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై సభా సంఘం వేయాలని టిడిపి పట్టుబట్టింది. ప్లకార్డులు ప్రదర్శించింది. సిపిఎం, సిపిఐ కూడా ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబట్టాయి.