పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా ఆమోదానికి టిడిపి అడ్డుపుల్ల

ఆయనపై చర్యలు తీసుకున్న తర్వాతనే రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నాదెండ్లకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం మూడుసార్లు నాదెండ్లను కలిసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. అయినా ఆయననుండి ఎలాంటి స్పందన లేదు. అందుకు టిడిపి వైఖరే కారణం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ముందుగా ఆయనపై చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని ఆ తర్వాతే రాజీనామాపై ఆలోచించాలని టిడిపి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణంగానే పోచారం రాజీనామా ఆమోదం ఆలస్యమవుతున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న ఈ దశలో పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేస్తానని చెప్పడంతో టిడిపి ఇరుకు పడిపోయింది. పోచారం రాజీనామాను ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఆమోదిస్తే ఆ వెంటనే ఎన్నికలు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి పోచారం ఘన విజయం సాధిస్తారు. అయితే ఇది ఇంతటితో ఆగిపోతుందని టిడిపి భావించనందువల్లే పోచారం రాజీనామాకు అడ్డుపడుతున్నట్లుగా తెలుస్తోంది. టిఆర్ఎస్‌లో చేరి పోచారం విజయం సాధిస్తే తెలంగాణ సెంటిమెంటు దృష్ట్యా మరికొందరు ఎమ్మెల్యేలు అదే దారిలో వెళ్లే అవకాశం ఉందని టిడిపి భావిస్తోంది.
అందుకే పోచారం రాజీనామా ఆమోదం పొందకుండా టిడిపి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంతకాలం పెండింగ్‌లో ఉంచితే అంత లాభం అన్నట్లుగా టిడిపి భావిస్తోంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీనుండి సి రామచంద్రయ్య ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లినప్పుడు టిడిపి ఇదే విధంగా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా పోచారం రాజీనామాపై తనపై ఎలాంటి ఒత్తిడిలు లేవని నాదెండ్ల చెబుతున్నారు.












Click it and Unblock the Notifications