హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతు తెలిపే దిశగా సిపిఎం కదులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు మాటలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సిపిఎంకు, తెలుగుదేశం పార్టీకి మధ్య ఈ మధ్య కాలంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సిపిఎం క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతూ వచ్చింది. తన దీక్ష సందర్భంగా రాఘవులు కాంగ్రెసుపైనే కాకుండా అప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీపై కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము జగన్‌కు మద్దతు ఇవ్వాలా, లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాఘవులు అప్పట్లో చెప్పారు. దీంతో సిపిఐ, సిపిఎం మధ్య మిత్రభేదం చోటు చేసుకుంది.
కాగా, సిపిఐ మాత్రం తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. తాము ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి కె. నారాయణ చెప్పారు. సిపిఐ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినంత మాత్రాన తాము ఇవ్వాల్సిన అవసరం లేదని రాఘవులు కచ్చితంగానే చెప్పారు. వైయస్ జగన్‌పై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిపిఐ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే, సిపిఎం మాత్రం తెలుగుదేశం పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో జగన్ వైపు చూస్తోందని అంటున్నారు.