వెనక్కి తగ్గని చంద్రబాబు, పట్టు వీడని హరికృష్ణ: టిడిపిలో ముసలం

కృష్ణా జిల్లా విభేదాలపై నివేదిక సమర్పించిన పార్టీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు మాటలనే తన నోట వినిపిస్తున్నారని చెబుతున్నారు. వంశీ రాజీనామా చేస్తే ఆమోదిస్తామని ఆయన చెప్పారు. దీన్నిబట్టి వంశీ రాజీనామాను ఆమోదించడానికే చంద్రబాబు సిద్ధపడినట్లు చెబుతున్నారు. వంశీ రాజీనామాను సోమవారం రాత్రి గానీ మంగళవారం గానీ ఆమోదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హరికృష్ణ రాజకీయాలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో తనకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే కృష్ణా జిల్లా నాయకుల విమర్శలను ఖాతరు చేయడం లేదని అంటున్నారు. అందుకే, వంశీతో గానీ కొడాలి నానీతో గానీ చంద్రబాబు మాట్లాడలేదని చెబుతున్నారు. వారితో మాట్లాడకుండానే కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి దేవినేని ఉమా మహేశ్వర రావు చేసిన రాజీనామాను చంద్రబాబు తిరస్కరించడం ద్వారా హరికృష్ణకు బలమైన సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారు.
హరికృష్ణ ఒత్తిడి రాజకీయాలకు తగ్గబోనని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అంటున్నారు. తాను చెప్పినట్లు నడుచుకుంటే ఉండండి, లేదంటే వెళ్లండనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. రాజీనామా చేయడానికి సిద్ధపడిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానీ వెనక్కి తగ్గారు. జూనియర్ ఎన్టీఆర్ పది, పదిహేనేళ్ల వరకు సినీ రంగంలో కొనసాగుతారని, లోకేష్ తన వ్యాపారాలు చేసుకుంటున్నారని, అందువల్ల ఇరువురి మధ్య పార్టీ నాయకత్వం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయని మీడియా రాయడం సరి కాదని ఆయన అంటున్నారు.
వంశీ రాజీనామా ద్వారా చంద్రబాబుపై పోరుకే హరికృష్ణ సిద్ధపడినట్లు అర్థమవుతోందని అంటున్నారు. వల్లభనేని వంశీ ఒకటి రెండు రోజుల్లో హరికృష్ణతో చర్చలు జరిపే అవకాశం ఉంది. చంద్రబాబుపై హరికృష్ణ తిరుగుబాటు ప్రకటిస్తారా, అసమ్మతితో సర్దుకుపోతారా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది. అయితే, హరికృష్ణ పోరుకే సై అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమైనా, తెలుగుదేశం మరో సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.