జగన్ వర్గంపై వేటు పడింది? స్పష్టత వచ్చిందన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల

అనర్హత విషయంలో న్యాయ సలహాల కోసం అడ్వకేట్ జనరల్ సుదర్శన రెడ్డి, న్యాయసలహాదారుడు రవి శంకర్ ఈరోజు తనను కలిసి వివరించారని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుదర్శన రెడ్డి తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా డిప్యూటీ స్పీకర్ కు ఇచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఈ విషయంపై ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలిపారు. టిడిపికి చెందినముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందాయన్నారు. తమ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలపై అనర్హత వేటు వేయమని టిడిపి కోరుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి అనర్హత నిర్ణయం తర్వాత ఇక పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా సమాచారం.
కాగా ఏజితో సమావేశం అనంతరం జగన్ వర్గం టిడిపి నేతలు బాలనాగిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై వేటు పడినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా వెలవడలేదని సమాచారం. మొత్తానికి వారిద్దరికి నోటీసులు ఇవ్వడానికి డిప్యూటీ స్పీకర్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అయితే తెలంగాణకు చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో మాత్రం అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నట్లుగా సమాచారం. పోచారంపై వేటు వేయాలా లేక రాజీనామా ఆమోదించాలా అనే విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లుగా సమాచారం. కాగా నల్లపురెడ్డికి ఇదివరకే నోటీసులు ఇచ్చినందున ఇక బాలనాగిరెడ్డికి ఇవ్వడానికి సిద్దపడినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications