తెలంగాణ ఇస్తే జగన్ ప్రభావమెలా ఉంటుంది... గులాం నబీ ఆజాద్ ఆరా?

ఒకదశలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగింపునకు సంబంధించిన చర్చ వైఎస్ జగన్ కేంద్రబిందువుగా చేసుకొని సాగిందని తెలిసింది! తెలంగాణ ఇస్తే జగన్ ప్రభావమెలా ఉంటుంది? ఇవ్వకుంటే ఎలా ఉంటుందని నేతలను ఆజాద్ స్పష్టంగా ప్రశ్నించారు. దీనికి ఇరు ప్రాంతాల నేతలూ తమ వాదనకు అనుకూలమైన సమాధానాలు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఇస్తేనే రెండు ప్రాంతాల్లోనూ జగన్ ప్రభావాన్ని అడ్డుకోవడం సాధ్యమని ఆ ప్రాంత నేతలన్నారు.
''రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉంటాయి. ఏ ప్రాంతంలోనైనా జగన్‌తో కాస్త నష్టం జరిగినా 2014 ఎన్నికలకు రెండేళ్లకు పైగా ఉన్నందున వాటిని సరిచేసుకోవచ్చు. తెలంగాణ ఇస్తేనే జగన్ వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకుని పార్టీని పటిష్టం చేయడం సాధ్యం. లేదంటే వచ్చే ఎన్నికల్లో జగన్ తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవచ్చు. అప్పుడిక కాంగ్రెస్ కోలుకోవడం కూడా అసాధ్యం"" అని పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, నర్సారెడ్డి వివరించారని తెలిసింది.
సీమాంధ్ర నేతలేమో, తెలంగాణ ఇస్తే తమ ప్రాంతాల్లో తలెత్తే సెంటిమెంటు, ఉద్యమాలు వైఎస్‌ఆర్ పార్టీకి అనుకూలంగా మారుతాయని వాదించారు. ''ఇప్పటికే సీమాంధ్రల్లో కాంగ్రెస్ శ్రేణులు వైఎస్సార్ పార్టీవైపు చూస్తున్నందున పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుంది. పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే బాహాటంగానే జగన్ వెనక తిరుగుతున్నారు. ఇలాంటప్పుడు తెలంగాణ ఇస్తే పార్టీ నేతలంతా వైఎస్సార్ పార్టీలోకి వెల్లువలా వెళ్తారు"" అని పేర్కొన్నారు.
జగన్ వెంట బహిరంగంగా తిరుగుతున్న కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై అధిష్టానం ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేక పోవడాన్ని ఇరు ప్రాంతాలకూ చెందిన కొందరు నేతలు తప్పుబట్టారు. ''ఈ పాటికే చర్యలు తీసుకునుంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. దాన్ని గాలికి వదిలేయడం పార్టీని పటిష్టం చేయడమెలా అవుతుంది?"" అన్నారు. పార్టీతో పాటు మంత్రివర్గంలోనూ జగన్‌కు అనేకమంది అనుకూలురున్నారని ఆమోస్ తదితరులు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు మంత్రులు జగన్‌కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications