ఓపిక పట్టలేకే సభను ఏర్పాటు చేశా: ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ కోసం ఏ పదవిని అయినా వదులుకోవడానికి సిద్ధం అని చెప్పారు. తనపై మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. తాను ఓ మీడియాను కొంటున్నట్టు వార్తలు వచ్చాయని అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరైనా జై తెలంగాణ అంటే చాలు వారిపై బురద జల్లేందుకు ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. తాను ఓ సారి బిజెపిలోకి వెళుతున్నట్లు, మరోసారి టిఆర్ఎస్, కాంగ్రెసులోకి వెళుతున్నట్లు, మరోసారి జగన్ పార్టీలో చేరనున్నట్లు ఇంకోసారి కొత్త పార్టీ పెడుతున్నట్లు పుంఖానుపుంఖాలుగా సృష్టిస్తున్నారని, అది సమంజసం కాదన్నారు. 1969 ఉద్యమంలో విరామం అనేది లేదని కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమానికి విరామం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
శ్రీకృష్ణ కమిటీ అందజేసిన చాప్టర్ 8లో తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాన్ని ఎలా అణిచి వేయాలి, టిఆర్ఎస్‌ను ఎలా ప్రలోభ పెట్టాలి, ఏ నాయకుడిని ఎలా ప్రలోభ పెట్టాలి, కాంగ్రెసు తెలంగాణ నేతలను ఎలా మచ్చిక చేసుకోవాలనే దానిపైనే చర్చించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా ముంచిందన్నారు. ఇక నుండి అయినా అందరూ కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉందని నాగం అభిప్రాయపడ్డారు. కాగా నాగం సభలో ప్రసంగిస్తున్న సమయంలో జైపాల్ రెడ్డి ఇంటికి అందరం వెళ్లి ప్రశ్నిద్దామని అనడంతో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications