సోనియా ఆలోచన: వైయస్ జగనే లక్ష్యంగా పిసిసి నేత ఎంపిక

మంత్రి కన్నా లక్ష్మినారాయణ తాను పిసిసి అధ్యక్ష పదవికి రేసులో ఉన్నానని ప్రకటించారు. ఆ పదవి కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, గుంటూరు జిల్లాకే చెందిన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో వీరిద్దరికీ పడడం లేదు. వీరిద్దరు పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకున్నారు. అదే సమయంలో మరో సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆలోచన మరో విధంగా ఉంది. ముఖ్యమంత్రి సీమాంధ్రకు చెందిన నాయకుడు కావడం వల్ల తెలంగాణ నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పసిసి అధ్యక్ష పదవిని బలహీనవర్గాలకు చెందినవారికి ఇవ్వాలనుకుంటే పార్లమెంటు సభ్యుడు వి. హనుమంత రావు అయితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. పులివెందుల శాసనసభ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన వైయస్ వివేకానంద రెడ్డి, కడప పార్లమెంటు స్థానంలో ఓటమి చవి చూసిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా, పిసిసి అధ్యక్షుడి ఎంపిక కోసం కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగానే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.