ఉప ఎన్నికలలో వైయస్ జగన్ కన్నా కాంగ్రెసు ఖర్చే ఎక్కువ
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కన్నా కాంగ్రెసు పార్టీయే ఎక్కువ ఖర్చు చేసిందని సెంటర్ ఫర్ మీడియా సంస్థ చేసిన సర్వేలో తేలింది. సాధారణంగా అందరూ జగన్ ఉప ఎన్నికలలో గెలవడానికి చాలా ఖర్చు చేశారని భావిస్తున్నారు. కానీ ఈ సంస్థ చేసిన సర్వేలో జగన్ కన్నా కాంగ్రెసు ఎక్కువ ఖర్చు చేసినట్టు తేలిందంట. అంతేకాదు మీడియాలో వస్తున్నట్లు ఈ ఉప ఎన్నికల్లో ఐదారు వందల కోట్లు ఖర్చు కాలేదని తేల్చి చెప్పింది. మూడు పార్టీల ఖర్చు మొత్తం రూ.200 కోట్లు మాత్రమే ఉంటుందని చెప్పింది. అందులోనూ కాంగ్రెసు పార్టీదే సగమంట. మిగిలిన సగంలో జగన్ పార్టీ ఎక్కువ ఖర్చు చేయగా టిడిపి ఆ తర్వాతి స్థానంలో ఉందంట.
అయితే జగన్ పక్కా వ్యూహంతో డబ్బులను స్థానిక పేరుపొందిన నాయకులకు ఇచ్చి వోటర్లను తమ వైపు లాక్కుంటే, కాంగ్రెసు మాత్రం నాయకులకు కాకుండా నేరుగా వోటర్లకే ఇచ్చారు. అయితే కాంగ్రెసు నుండి డబ్బులు తీసుకున్న వోటర్లు మాత్రం స్థానిక నాయకుల సూచనతో జగన్‌కు వోటు వేశారని తేల్చారు. ఈ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటు వేయడానికి కొంతమంది సిగ్గు పడ్డారంట కూడా. వోటుకు నోటుపై వారు విముఖత వ్యక్తం చేశారంట.