కాంగ్రెసు కాలయాపనకు కెసిఆర్ సహకారం, అందుకే సుదీర్ఘ విరామం?

తమకు ఆరు, పది తేదీల మధ్య అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ పార్లమెంటు సభ్యులు బుధవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కోరుతూ ఓ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసి తెలంగాణలో పార్టీని కాపాడాలని వారు ప్రధానిని కోరారు. జూన్ 5వ తేదీన విస్తృత స్థాయి సమావేశం జరిపి, ఆరు ఢిల్లీకి వెళ్లాలనేది వారి నిర్ణయం. ప్రధాని అపాయింట్‌మెంట్లు, ప్రణభ్ ముఖర్జీతో భేటీలు, సోనియా గాంధీకి వేడుకోళ్ల వంటి కార్యకలాపాలతో తెలంగాణ సాధన కాలవ్యవధిని పెంచుతూ పోతున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు కాలయాపన చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహా రెడ్డి అంటున్నారు. మరి, తెరాస ఏం చేస్తోంది, తెరాస అధినేత కెసిఆర్ ఏం చేస్తున్నారనేది కూడా ప్రశ్నే.
కెసిఆర్ కాంగ్రెసు అధిష్టానానికి సహకరిస్తూ ఉద్యమానికి దీర్ఘ కాలిక విరామాన్ని ప్రకటించినట్లే కనిపిస్తున్నారు. ఉద్యమం అప్పుడు, ఇప్పుడు అంటూ వాయిదాలు వేస్తూనే ఉన్నారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఉద్యమించకపోతే తెరాస ఉద్యమించకూడదని ఏమీ లేదని అడిగేవారు లేకుండా పోయారని అంటున్నారు. కెసిఆర్ ప్రస్తుతం నమస్తే తెలంగాణ పత్రికను మార్కెట్లోకి తెచ్చే యత్నంలో బిజీగా ఉన్నారు. పత్రిక రూపురేఖలను స్వయంగా ఆయన తీర్చి దిద్దుతున్నారని అంటున్నారు. నమస్తే తెలంగాణ పత్రిక నిజానికి మే 28వ తేదీన స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి రోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, అది జూన్ 6వ తేదీకి వాయిదా పడింది. తమకు ఏ పార్టీతోనూ ప్రమేయం లేదంటూ చెప్పే తెలంగాణ రాజకీయ జెఎసి కూడా కెసిఆర్ మార్గంలోనే నడుస్తోంది. అది కూడా కాంగ్రెసు, తెరాసలకు అనుకూలంగా ఉద్యమ కార్యక్రమాలను రూపొందిస్తోంది.