వైయస్ జగన్‌పై కాంగ్రెసు నేతల అఫిడవిట్, సోనియా గాంధీకి చిక్కులు

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమత్రిగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, ఆయన ఫ్యాక్షన్ మూలాలకు జడిసిన రాజ్యాంగ వ్యవస్థలు ఈ దోపిడీని అరికట్టలేకపోయాయని, రాజకీయ అవసరాల కోసం వైయస్సార్ పంపే నిధుల కోసం భారత ప్రభుత్వం కూడా ఈ దోపిడీపై ప్రేక్షక పాత్ర వహించిందని ఆమోస్, యాదవ రెడ్డి వాదించారు. అంటే, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై వారు నేరుగా ఆరోపణలు చేసినట్లేనని భావిస్తున్నారు.
వైయస్సార్ హయాంలో జరిగిన దోపిడీని జాతీయ స్థాయిలో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో మాత్రమే పోల్చగలమని వారు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వ్యాఖ్యానించారు. మొత్తం మీద, కాంగ్రెసు అధిష్టానం వైయస్సార్ హయాంలో జరిగిన దోపిడీని చూస్తూ ఊరుకుందని ఆ పార్టీ నేతలే విమర్శించినట్లయిందని అంటున్నారు. వైయస్ జగన్ అక్రమాస్తులపై ప్రస్తుతం మంత్రిగా ఉన్న శంకరరావు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హైకోర్టుకు ఓ లేఖ రాసింది. దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తాము కూడా పాలుపంచుకుంటామంటూ కాంగ్రెసు నాయకులు ఆమోస్, యాదవరెడ్డి హైకోర్టును కోరారు. పూర్తి వివరాలతో ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు.