స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: జోక్యం చేసుకోలేమన్న కోర్టు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంగళవారం హైకోర్టు సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించాల్సిందిగా కోరిన రాష్ట్ర సర్పంచుల సంఘం పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చని చెప్పింది. కాగా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు కేవలం 50 శాతం మాత్రమే ఉండాలని కానీ 60.5 శాతం రిజర్వేషన్లు రాష్ట్రంలో ఉన్నాయని కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.
అయితే దీనిపై వాదోపవాదాలు విన్న కోర్టు రిజర్వేషన్ల విషయంలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ 50 శాతమా లేక 60 శాతమా అనే విషయంలో ఇప్పుడు చెప్పలేమని అంది. రిజర్వేషన్లు ఆయా ప్రాంతాలను బట్టి ఇవ్వవచ్చుననే పద్ధతిలో హైకోర్టు తీర్పు ఉన్నట్టుగా అర్థం అవుతోంది. కాగా రాష్ట్ర సర్పంచుల సంఘం ఈ విషయంపై పై కోర్టుకు వెళుతుందా లేదా అన్న విషయంపై ఇంకా తెలియరాలేదు.