బొత్స సత్యనారాయణ దూకుడు, కిరణ్ కుమార్ రెడ్డిలో కలవరం

పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ మొత్తం వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనానికి ఎన్నికల కమిషన్ పచ్చజెండా ఊపిన తర్వాత తాను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను వెంట పెట్టుకుని వెళ్లి చిరంజీవిని కలిసి, మంతనాలు జరిపారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి పాలనాపరమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఒక్కసారిగా జూనియర్ ర్యాంక్ నుంచి సీనియర్ ర్యాంక్ వరకు 36 మంది ఐఎఎస్ అధికారులకు స్థానచలనం కలిగించారు. సమాచార కమిషనర్‌ను కూడా మార్చేశారు. మూడు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు.
పిసిసి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత బొత్స సత్యనారాయణ పలువురు మంత్రులను, ప్రభుదత్వాధికారులను కలిశారు. పాలనా యంత్రాంగంపై కూడా పట్టు సాధించేందుకు బొత్స సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారు. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ఐఎఎస్ అధికారులను భారీగా బదిలీ చేశారు. ఆర్థిక శాఖను పూర్తిగా మార్చేశారు. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య సలహాలను కూడా ఆయన తీసుకున్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ దూకుడు ముందు తాను మరుగున పడిపోకూడదనే లక్ష్యంతో కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయడానికి సిద్దపడ్డారు. ఈ వాతావరణంలో ఇరువురి మధ్య పొరపొచ్చాలు తీవ్రమైనా ఆశ్చర్యం లేదు.












Click it and Unblock the Notifications